ఏది రియల్? ఏది వైరల్? కేరళలో జటాయువు కనిపించిందా! - MicTv.in - Telugu News
mictv telugu

ఏది రియల్? ఏది వైరల్? కేరళలో జటాయువు కనిపించిందా!

August 3, 2019

Mythical bird Jatayuvu issue

జటాయువు.. పెద్దపెద్ద రెక్కలు, భారీ ముక్కుతో భీకరంగా కనిపించే పక్షి. దీన్ని చూసిన వాళ్లెవరూ ఇప్పుడు లేరు. రామాయణంలో సీతమ్మవారిని ఎత్తుకెళ్తున్న రావణాసురుడిపై భీకరంగా పోరాడి నేలకొగిరిన జటాయువుపై ప్రజల్లో ఎన్నో కథలుగాథలూ ఉన్నాయి. సాక్షాత్తూ ఆ గరుత్మంతుడే జటాయువుగా వచ్చాడనే కథనం మొదలు జటాయువు ఓ శాపగ్రస్థ రుషి అనే కథలు బోలెడు భారత ఉపఖండంలో, ఆగ్నేయాసియా దేశాల్లో ఉన్నాయి. 

అలాంటి జటాయువు జాతి పక్షి ఒకటి కేరళలో ఇటీవల కనిపించిందని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పదడుగులకుపైగా పొడవైన రెక్కలతో భారీగా ఉన్న పక్షి ఒకటి కొండ అంచు నుంచి నింగిలోకి వెళ్తోంది అందులో. ఇది కేరళలోని చండయమంగళం ప్రాంతంలో తీసిన వీడియో అని కొందరు పోస్ట్ చేశారు. రామాయణంలోని జటాయువు రావణుడి ఖడ్గప్రహారాలకు నేలకొరిగింది ఈ ప్రాంతంలోనే అని ప్రతీతి ఉండడంతో వీడియోలోని మహావిహంగం కూడా జటాయువేనని కొందరు ప్రచారం చేస్తున్నారు. చండయమంగళంలో జటాయువు శిల్పం కూడా ఉండడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంటోంది. 

ఇదీ అసలు విషయం.. 

అయితే ఈ వీడియో ఐదారేళ్ల కిందటే యూట్యూబ్, ఇతర వైబ్ సైట్లలో దర్శనమిచ్చింది. అందులోని పక్షిని దాని సంరక్షకులు ప్రకృతిలోకి స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. అది రాబందుల్లోని కాండోర్ జాతికి చెందిన పక్షి. ఇవి దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాలు, అమెరికోని అరిజోనా, ఉటా రాష్ట్రాలో కనిపిస్తుంటాయి. కాండోర్ జాతిలో ఆండియన్ కాండోర్, కాలిఫోర్నియా కాండోర్ అనే ఉపజాతులు ఉన్నాయి. ఎగిరే పక్షుల్లో ఇవే అత్యంతపెద్దవి. వీటి రెక్కలు  3.2 మీటర్లు.. అంటే దాదాపు 12 అడుగులపైనే ఉంటాయి. శరీరం బరువు 15 కేజీలు తూగుతుంది.  70 ఏళ్లకుపైగా బతికే ఈ పక్షులు 5 వేల మీటర్ల ఎత్తులో రాళ్లమధ్య గుడ్లు పెడతాయి. జంతుకళేబరాలను తింటుంటాయి. శాస్త్రవేత్తలు వీటిని అంతరించిపోతున్న జాతిగా గుర్తించారు.