కరోనా వైరస్: అపోహలు.. నిజాలు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా వైరస్: అపోహలు.. నిజాలు

March 21, 2020

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మందికి ఈ వైరస్ సోకింది. వారిలో దాదాపు 11 వేల మంది మరణించారు. అయితే కరోనా వైరస్ పై ఎన్నో అపోహలు, తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో పనిచేస్తున్న తెలుగు డాక్టర్ చైతన్య చెక్కిళ్ల కరోనా వైరస్‌పై వస్తున్న అపోహలపై స్పష్టత ఇచ్చారు.

Myths and facts about coronavirus

 

ప్రశ్న: కరోనా వైరస్ వేడికి నశిస్తుందా? భారత దేశం వంటి వేడి దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందదని వింటున్నాం కదా.

జవాబు: Flu (influenza) cases ఎండాకాలంలో తగ్గిపోయినట్టే కరోనా వైరస్‌తో వచ్చే COVID-19 కూడా ఎండాకాలంలో సమసిపోతుందని కొన్ని ఆశలు లేకపోలేదు. వేడి వల్ల వైరస్ వ్యాప్తి చెందదు అనే ఆశ ఉన్నా, ఇప్పుడు ఆస్ట్రేలియా, సింగపూర్‌లో చూస్తే పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. వేడి ప్రదేశమైన ఫ్లోరిడాలో కరోనా వైరస్ విజృంభించి వ్యాపిస్తుంది. ఎండాకాలంలో ఇది influenza లా సమసిపోతుందా, లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇది కొత్త వైరస్ కావడంతో ఇది ఎట్లా ప్రవర్తిస్తుందో ఇప్పుడే చెప్పలేము. ఆధారాలు లేని విషయాలను ఊహించి ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించకపోవడం మనకు నష్టం కలిగిస్తుంది.

Myths and facts about coronavirus

ప్రశ్న: పారాసెటమాల్‌తో కరోనా వైరస్ నయమవుతుందా?

జవాబు: కరోనా వైరస్ వచ్చినవాళ్లు 80% మంది జ్వరం, దగ్గు వంటి వాటితో బాధపడి కోలుకుంటారు. వాళ్లకి ఎటువంటి మందులు ఇచ్చినా, ఇవ్వకపోయినా కోలుకుంటారు. పారాసెటమాల్‌ జ్వరంను తగ్గిస్తుంది. జ్వరం వచ్చే ఏ రోగానికైనా పారాసెటమాల్‌ జ్వరం నుండి ఉపశమనం ఇస్తుంది. అంతే కాని దానితో రోగం నయం కాదు. ఉదాహరణకు మలేరియా, టీబీ, ఫ్లూ వంటి రోగాల్లో కూడా జ్వరం నుండి ఉపశమనం కోసం పారాసెటమాల్‌ వాడుతారు. అట్లానే కరోనా వైరస్‌తో వచ్చే జ్వరానికి కూడా పారాసెటమాల్‌ వేసుకోవచ్చు.

కరోనా వైరస్‌తో తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్‌లో చేరేవాళ్లకు, pneumonia (ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్) తో, ఊపిరితిత్తుల్లో నీరు నిండడంతో, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. దానికి ఆక్సిజెన్ అవసరం పడుతుంది. తీవ్రమైన కేసుల్లో వెంటిలేటర్ మీద ఉంచే అవసరం పడుతుంది. Acute respiratory distress syndrome (శ్వాస వ్యవస్థ పనిచేయకపోవడం), acute cardiac injury (గుండెకు హాని జరగడం), shock (కణాలకు ఆక్సిజెన్ అందకపోవడం) కరోనా వైరస్‌తో చనిపోవడానికి ముఖ్యమైన కారణాలు. వాళ్లని పారాసెటమాల్‌తో నయం చేయలేమనేది వేరే చెప్పనవసరం లేదు.

Myths and facts about coronavirus

ప్రశ్న: పొడి దగ్గు, జ్వరం ఉంటేనే కరోనా వైరస్ సోకినట్టా? అవి లేకపోతే సేఫ్‌గా ఉన్నట్టేనా?

జవాబు: కరోనా వైరస్ వ్యాధిలో ఎక్కువగా కనిపించే లక్షణాలు జ్వరం, నీరసం, పొడి దగ్గు, ఆకలి లేకపోవడం, ఒళ్ళు నొప్పులు, కఫం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. కొంత మంది రోగుల్లో తల నొప్పి, గొంతు నొప్పి, ముక్కు కారడం, వికారం, నీళ్ళ విరేచనాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో కొంత మందికి ఒకటో, రెండో లక్షణాలే ఉండవచ్చు. కొంత మందిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవచ్చు. కొంతమందిలో ఎక్కువ లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలు చాలా మటుకు జలుబు, ఫ్లూ వంటి ఇతర వైరల్ వ్యాధుల్లో కనిపించేవే. అందుకని వ్యాధి లక్షణాలను బట్టి మాత్రమే కరోనా వైరస్‌ను గుర్తు పట్టలేము. టెస్టింగ్‌తో మాత్రమే ఖచ్చితంగా గుర్తు పట్టే అవకాశం ఉంది. 

ప్రశ్న: కరోనా వైరస్ వస్తే చనిపోతామా?

జవాబు: కరోనా వైరస్ వచ్చిన వారిలో 1-2% మంది చనిపోతారు. అది చిన్న సంఖ్యలా కనిపించవచ్చు. కానీ, వ్యాధిని అరికట్టకపోతే కొత్త వ్యాధి కావడం వల్ల, ఎవరికీ రోగనిరోధక శక్తి లేనందువల్ల ప్రపంచంలో 50-65% ప్రజలు కరోనా బారిన పడే అవకాశం ఉంది. ఉదాహరణకు సుమారు నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న తెలంగాణాలో వ్యాధిని అరికట్టే చర్యలు తీసుకోకపోతే రెండు నుండి రెండున్నర కోట్ల మందికి కరోనా సోకే అవకాశం ఉంది. తక్కువలో తక్కువ 1% అనుకున్నా రెండు నుండి రెండున్నర లక్షల మంది చనిపోయే అవకాశం ఉంది. అందుకే అందరూ ఈ వ్యాధిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఇచ్చే సూచనలను పాటించి అత్యవసరమైతే తప్ప ఇంటి బయటకు వెళ్లకుండా, ఇతరులతో కలవకుండా ఉండాల్సిన అవసరం ఉంది. వైరస్ బారిన పడిన వాళ్ళు 14 రోజులు అందరినుండి దూరంగా ఉండి వ్యాధి ఇంకొకరికి సోకకుండా జాగ్రత్తపడాలి.

ప్రశ్న: కరోనా వైరస్ సోకిన వాళ్ళు చాలా మంది కోలుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి కదా. మారేందుకు దీని గురించి ఇంత భయాందోళనలు?

జవాబు: అవును పైన చెప్పినట్టు కరోనా వైరస్ వచ్చిన వారిలో 1-2% మంది మాత్రమే చనిపోతారు. అంటే వంద లో 98-99 మంది దీని నుండి కోలుకుంటారు. అయితే వందలో పది నుండి ఇరవై మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్‌లో చేరవలసిన అవసరం పడుతుంది. 60 ఏళ్ళకు పైబడిన వృద్ధులు, గుండె జబ్బులు, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళకు కరోనా వైరస్ సోకితే తీవ్ర అస్వస్థతకు గురయ్యి చనిపోయే అవకాశాలు ఎక్కువ. 80 % మంది స్వల్ప అస్వస్థత మాత్రమే కలిగిన ప్రజలు మామూలుగా తిరుగుతూ వృద్ధులకు, ఇతర వ్యాధులున్న వారికి వ్యాప్తి చేసి వారి మరణాలకు కారణమవుతారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా చెప్పే జాగ్రత్తలు మన గురించే కాదు మన చుట్టూ ఉన్నవాళ్ళ కోసం పాటించాల్సిన అవసరం ఉంది. ఎంత ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందో పైన రాసిన దాంట్లో మళ్లీ ఒకసారి చదవండి. 

ప్రశ్న: కరోనా వైరస్‌కి మందులు లేవా? వాట్సాప్‌లో ఎన్నో చిట్టి చిట్కాలు చూస్తున్నాం కదా. ఏవో మందులతో COVID-19 నయమయిపోతుంది అన్న వార్తలు వింటున్నాం కదా?

జవాబు: కరోనా వైరస్‌కి ప్రస్తుతానికి ఏమీ మందులు లేవు. చాలా దేశాల్లో రకరకాల మందులతో ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని మందులు ఎంతో కొంత పని చేసినట్టు కనిపించినా ఇప్పటివరకూ ఖచ్చితంగా కరోనా వైరస్‌కి పని చేసే మందులేమీ గుర్తించబడలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్ఐవికి వాడే antivirals, ఇతర antivirals, మలేరియాకి వాడే chloroquine తో వివిధ దేశాల్లో ఒకేసారి ప్రయోగాలు మొదలుపెడుతుంది. 

COVID-19 కేసులు అత్యధికంగా ఉన్న దేశాల్లో కనుగొనలేని మందులు, ఉపశమనాలు, చిట్కాలు, ఆసక్తికరంగా కరోనా వైరస్ ఇంకా పెద్దగా వ్యాప్తి చెందని భారత దేశంలో కనుగొన్నట్టు చెబుతున్నారు. అసలు కేసులు లేకుండా ఎవరి మీద ప్రయోగాలు చేసినట్టు, మందులు, చిట్కాలు పని చేస్తాయని ఎట్లా నిర్ధారించినట్టు? కరోనా వైరస్‌ని నయం చేస్తున్నట్టు వచ్చే నకిలీ మందులను, నకిలీ చిట్కాలను తిప్పి కొట్టండి. వాటిని forward చేయడం ఆపండి. తప్పుడు భరోసాలతో ఉంటే వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశాలు ఎక్కువ.  

ప్రశ్న: 60 కన్నా ఎక్కువ వయసున్న వాళ్ళకే కరోనా వైరస్‌తో తీవ్రమైన అస్వస్థత కలుగుతుందంట కదా. యువత ఎందుకు జాగ్రత్తలు పాటించాలి?

జవాబు: అమెరికాలో COVID-19తో హాస్పిటల్ పాలైన వాళ్ళలో 40% మంది 20-54 వయసులలో ఉన్నవాళ్లే. 60 ఏళ్లకు పైబడిన వాళ్లు తీవ్ర అస్వస్థత కలిగి, చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నా కరోనా వైరస్ అన్ని వయసుల వాళ్ళకు అస్వస్థతను కలిగిస్తుంది. తీవ్ర అస్వస్థత కలిగినవాళ్లు కోలుకోవడానికి మూడు నుండి ఆరు వారాల సమయం పట్టవచ్చు. 

Myths and facts about coronavirus

ప్రశ్న: కరోనా వైరస్ లాంటి మహమ్మారి ఇంతకముందు ఎప్పుడైనా వచ్చిందా? 

జవాబు: 1918 లో స్పానిష్ ఫ్లూ (spanish flu) అనబడే H1N1 వైరస్ ప్రపంచంలో అయిదు నుండి పది కోట్ల మంది మరణానికి కారణమైనది. అతి వేగంగా వ్యాప్తి చెందిన స్పానిష్ ఫ్లూ ప్రపంచంలో మూడో వంతు జనాభాకు సోకింది. పరిశోధనల్లో స్పానిష్ ఫ్లూ పక్షుల నుండి మనుషులకు పాకినట్టు తెలుస్తుంది. ఇప్పటి కరోనా వైరస్ చైనా లేదా అమెరికా ల్యాబ్‌లో తయారు చేసినట్టు ఊహాగానాలు వస్తున్నాయి. ప్రపంచంలో ఆధిపత్యం కోసం ఆ దేశాలు చేసే కుట్రల నిజానిజాలు బయటపడే రోజు బయట పడతాయి. కానీ, ఇట్లాంటి మహమ్మారి వందేళ్ళ క్రితమే ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. 

ప్రశ్న: భారత దేశంలో కరోనా వైరస్ కేసులు 250 మాత్రమే ఉన్నాయి. దీనికే ఇంత ఆందోళన ఎందుకు? 

జవాబు: ఒక దేశంలో 200 కేసులు, మరో దేశంలో 2000 కేసులు ఉంటే రెండో దేశంలో epidemic పదింతలు ఉన్నట్టు కాదు. కరోనా వైరస్ కేసులు ప్రతి ఆరు రోజులకు డబుల్ అవుతాయనేది ఇప్పటివరకూ ఉన్న గణాంకాలను బట్టి తెలుస్తుంది. అంటే మొదటి దేశం రెండు మూడు వారాల్లో రెండో దేశం ఉన్న దశకు చేరుకోనుందని అర్థం. ఫిబ్రవరి 27 న మొదటి community transmission కేసు (అంటే ఎవరి నుండి వైరస్ సోకిందో తెలియని కేసు) నమోదు చేసుకున్న అమెరికాలో ఈరోజు 18,000 కు పైగా కేసులు నమోదయినాయి. టెస్ట్ కిట్ల కొరతతో తీవ్రమైన పరిస్థితిలో ఉన్నవాళ్లనే ఎక్కువగా టెస్ట్లు చేస్తున్న సందర్భంలో నమోదయిన నంబర్లివి. ఇందంతా చెప్పేది ఆందోళన పెంచడానికి కాదు. ఈ మహమ్మారిని సరిగ్గా అర్థం చేసుకొని సరైన జాగ్రత్తలు తీసుకోవడానికి. అందరూ అప్రమత్తంగా ఉండి వైరస్ వ్యాప్తి చెందకుండా చేయగలిగితే అంతకన్నా కావలసింది ఏముంది? చైనా తీసుకున్న తీవ్రమైన, ఖచ్చితమైన చర్యల వల్ల, ప్రజలు అన్ని జాగ్రత్తలూ పాటించడం వల్ల అక్కడ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్ట కలిగారు. 

ఇదంతా చైనా తప్పో, మన దేశంలోకి ఇంకో దేశం నుండి వచ్చిన వాళ్ళ తప్పో అని నిందించుకోవాల్సిన సమయం కాదు. ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన కాలంలో మనం జీవిస్తున్నాం. ఎన్నో దేశాలు పర్యటించాలని ఆశపడుతూ, వీలయినన్ని దేశాలు తిరుగుతూ, అన్ని దేశాల్లో తయారవుతున్న టెక్నాలజీ, విలాస వస్తువులను అనుభవిస్తున్న ప్రజలు, రోగాలు వచ్చినప్పుడు మాత్రం ఎవరినో ఒకరిని నిందించడం సరైనది కాదు. COVID-19ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘చైనీస్ వైరస్’ అని పిలవడం అతని జాత్యహంకారాన్ని, అసహన భావాన్ని తెలియజేస్తుంది. అట్లాంటి ద్వేషపూరిత ఆలోచనల నుండి మనం దూరంగా ఉందాం.

ఆందోళన పెరిగినప్పుడు ఎదుటివాళ్లను నిందించడం చాలా సులువు. కానీ మనమందరం ఈ విపత్తులో కలిసి ఉన్నామనేది మనం మరువకూడని సమయమిది. Humans are more alike than different. ఎంత భయాందోళనలో అయినా మన మనిషితనాన్ని కోల్పోకుండా ఉండగలిగితే, ఇలాంటి సంక్షోభ సమయాలను కలిసికట్టుగా ఎదుర్కోగలుగుతాం.

Myths and facts about coronavirus

  • డాక్టర్ చైతన్య చెక్కిళ్ల, MD