నాల్.. పసితనాన్ని మళ్లీ చేతికందిస్తున్న బొడ్డుతాడు - MicTv.in - Telugu News
mictv telugu

నాల్.. పసితనాన్ని మళ్లీ చేతికందిస్తున్న బొడ్డుతాడు

October 19, 2018

బాల్యం అందమైన గతమే కాదు, జీవితపు కొసవరకు కొనసాగే అపురూప గ్నాపకం కూడా. అది భవితను కూడా నిర్దేశిస్తుంది. పాపం, పుణ్యం, ప్రపంచమార్గం, కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ ఏమీ ఎరుగని పసితనాలు.. పెద్దయ్యాక లోకానికి వెలుగుదారి చూపుతాయి. బాల్యపు సౌందర్యాన్ని శ్రీశ్రీ వంటి ఎందరో మహాకవులు అద్భుతంగా గానం చేశారు. వెండితెరపైనా కొంత ప్రయత్నం జరిగింది. కానీ నవంబర్‌లో మనముందుకొస్తున్న మరాఠీ చిత్రం నాల్(బొడ్డుతాడు) చూపినంత అందంగా, సంబరంగా, లాలనగా,  గోరుముద్దంత ప్రేమగా మరెవరూ చూపి ఉండకపోవచ్చు…!!

నాల్.. ఎనిమిదేళ్ల పిల్లాడి జీవనశ్వాస. తల్లినుంచి కోడిపిల్ల వరకు, చెట్టు నుంచి ఏటిగట్టు వరకు, పుట్టచీమ నుంచి తేనెపట్టువరకు, కర్రాబిళ్లా నుంచి కోతికొమ్మచ్చి వరకు, చలిమంటల వెలుతురు నుంచి సబ్బు బుడగల సప్తవర్ణాల దాకా.. అందమైన, చీకూచింతాలేని పల్లెసీమలో ఆ చిన్నారి సాగించే చిట్టి బతుకు పయనాన్ని నాల్ దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, మన తెలుగువాడు సుధాకర్ రెడ్డి యక్కంటి కొత్త కళ్లతో, కొత్త ఫ్రేములతో పరిచయం చేస్తున్నారు. దసరా పండగలో పండగలా విడుదలైన నాల్‌లోని ‘జావూ దె న వ’ పాట ప్రేక్షకులను చేతులు పట్టుకుని తమ బాల్యంలోకి, పల్లెల్లోకి తీసుకెళ్తోంది. బాల్యం అంటే ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఈ పాటను చూపితే చాలు అన్నంత అద్భుతంగా, కవితాత్మకంగా, కళాత్మకంగా రూపుదిద్దారీ పాటను.

రెండేళ్ల కిందట సంచలనం సృష్టించిన మరాఠీ ‘సైరాట్’ చిత్రం టీమే నాల్ నిర్మాణంలో పాలుపంచుకుంది. సైరాట్ దర్శకుడు నాగరాజ్ మంజూలే సహనిర్మాతగా లీడ్ రోల్ పోషించారు. సైరాట్‌కు సినిమాటోగ్రఫీ అందించిన సుధాకర్ రెడ్డి.. నాల్‌కు కథ, మాటలతోపాటు సినిమాటోగ్రఫీ కూడా అందించారు. నవంబర్ 16న విడుదల కానున్న నాల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతిష్టాత్మక జీ స్టూడియోస్ సమర్పిస్తోన్న నాల్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఇప్పటికే సానుకూల స్పందన లభించింది. ఈ చిత్రం కూడా సైరాట్‌లా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం ఖాయమని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.