తెలుగు సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. అందరూ ఊహించినట్టు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్లలో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని నిర్వాహకులు మంగళవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ఒరిజినల్ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డు వచ్చిన పాటకే దాదాపు ఆస్కార్ వరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో తెలుగు సినీ ప్రముఖులు, ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా చిత్ర బృందంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మార్చిలో ఆస్కార్ అవార్డులను ప్రకటిస్తారు. కాగా, తెలుగు లేదా టాలీవుడ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి పాటగా నాటు నాటు నిలిచింది. నాటు నాటుతో పాటు మరో నాలుగు పాటలు అవార్డ్ కోసం పోటీ పడుతున్నాయి. అవి 1. అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్), 2. హోల్డ్ మై హ్యాండ్ (టాప్ గన్.. మార్వెరిక్), 3. లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), 4. ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీ థింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) పాటలు ఆస్కార్ బరిలో ఉన్నాయి.