భర్తను హిట్ బాట పట్టించిన సమంత.. కానీ.. - MicTv.in - Telugu News
mictv telugu

భర్తను హిట్ బాట పట్టించిన సమంత.. కానీ..

April 16, 2019

‘ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ’ ఉంటుందని నానుడి. ఇది చాలా మంది జీవితాల్లో రుజువైంది. టాలీవుడ్ లవ్లీ కపుల్ చై-సామ్‌ల విషయంలోనూ ఇది నిజమైంది . వీరిద్దరు ‘ఏ మాయ చేసావే’  సినిమాతో కెరీర్‌లో మొదటి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత ‘ఆటో నగర్ సూర్య’ చిత్రంలో మళ్ళీ కలిసి నటించినా.. అది ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది.

‘మనం’ సినిమాలో మళ్ళీ కలిసి నటించి భారీ విజయాన్ని అందుకున్నారు. 2017లో వీరిద్దరి వివాహం జరిగింది. సాధారణంగా చాలామంది హీరోయిన్లు పెళ్లికాగానే నటనకు స్వస్తి చెపుతారు. పెళ్లి తరువాత కూడా హీరోయిన్‌గా కొనసాగించడం చాలా అరుదు. చాలా తక్కువ మంది అలా చేస్తుంటారు. వారిలో ఒకరు సమంత. పెళ్లి సమయంలోనే నాగ చైతన్య.. సమంత పెళ్లి తరువాత కూడా నటనను కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. అదే విధంగా నటనను కొనసాగిస్తున్నారు. కానీ మజిలీ చిత్రం విడుదల వరకు పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

నిజ జీవితంలో భార్యాభర్తలైన వీరు ‘మజిలీ’ చిత్రంలో కూడా భార్యాభర్తలుగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉన్నపటికీ సమంతదే పైచేయి. రంగస్థలం, సూపర్ డీలక్స్ చిత్రాల విజయాలతో సమంత మంచి ఫామ్‌లో ఉండగా… యుద్ధం శరణం, శైలజ రెడ్డి అల్లుడు, సవ్యసాచి వంటి వరుస పరాజయాలతో సతమతమవుతోన్న నాగ చైతన్య కెరీర్‌కు ‘మజిలీ’ చిత్రం ఆక్సిజన్ లాంటిదని చెప్పవచ్చు. దీంతో నాగచైతన్య కెరీర్‌ను సమంత మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించింది. ఎలాగైతే నాగ చైతన్య కెరీర్ మొదట్లో సమంతతో ‘ఏ మాయే చేసావే’ చిత్రంలో నటించి విజయం అందుకున్నాడో.. అలాగే మజిలీ చిత్రంలో మళ్ళీ సమంతతో నటించి విజయం అందుకున్నాడు. దీంతో సమంతను నాగ చైతన్య పాలిట అదృష్టంగా భావిస్తున్నారు అభిమానులు. మజిలీ చిత్రంలో భర్తను బాగుచేసే భార్య పాత్రలో నటించి మెప్పించిన సమంత రియల్ లైఫులోనూ అతనికి హిట్ ఇచ్చి సక్సెస్ గాడిలో పెట్టిందని అంటున్నారు. మూవీలో చైతన్య కూడా బాగానే నటించాడని, అయితే కొన్ని సన్నివేశాల్లో బిగుసుకుపోవడం, ఎక్స్‌ప్రెషన్స్ సరిగ్గా పండించకపోవడం వంటివి చేశాడని, సమంత వాటిని కూడా సరిద్దితుందని చెబుతున్నారు.