ఎట్టకేలకు జబర్దస్త్‌కు నాగబాబు వీడ్కోలు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎట్టకేలకు జబర్దస్త్‌కు నాగబాబు వీడ్కోలు..

November 21, 2019

ప్రతీ గురు, శుక్రవారాల్లో ఈటీవీ తెరమీద ‘జబర్దస్త్’ షోతో ప్రేక్షకులను నవ్వుతూ, నవ్విస్తూ పలకరించిన మెగా బ్రదర్ నాగబాబు ఇక ఆ షోకు స్వస్తి పలుకుతున్నారు. ఈ వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో రోజా కూడా ఈ షోను వదిలి వెళ్లిపోతున్నారనే గుసగుసలు వినిపించాయి. తాజాగా నాగబాబు ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు అనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమంది. దీనిపై నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తాను ఈ షో నుంచి తప్పుకుంటున్నట్టు తన యూట్యూబ్ చానల్‌లో వెల్లడించారు. ఫిబ్రవరి 2013 నుంచి 21 నవంబర్ 2019 వరకు తన ప్రయాణం జబర్దస్త్‌లో సుదీర్ఘంగా కొనసాగిందని నాగబాబు తెలిపారు. ఈ ప్రయాణం తనకు సంతోషాన్ని కలిగించిందని, చాలా ఎమోషనల్ జర్నీ అని పేర్కొన్నారు. 

ఆయన మాట్లాడుతూ.. ‘నాకు నేనుగా జబర్దస్త్ మానేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఓ ప్రోగ్రాం కానీ, ప్రయాణం కానీ ఎక్కడో చోట ముగింపు పలకాల్సిందే. అయితే ప్రోగ్రాం ముగియకుండానే నాకు నేనే ముగింపు ఇచ్చుకున్నాను. ఏడున్నర సంవత్సరాలు ఆ కార్యక్రమంతో ప్రయాణం చేశాను. ఇందుకు నేను మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డికి, ఈటీవీ వారికి కృతజ్ఞతలు చెబుతున్నాను. నాకు మంచి పారితోషకమే ఇచ్చారు కానీ, అది నా స్థాయికి తగ్గ పారితోషకం కాదు. నేను పారితోషకం తక్కువ ఇస్తున్నారనే కారణంతోనే జబర్దస్త్ మానేస్తున్నాననేది తప్పు. నాకు పారితోషకం ఎప్పటికీ ఓ ప్రామాణికం కాదు. నేను జబర్దస్త్‌కు వెళ్లినప్పుడల్లా ఓ జాలీ ట్రిప్‌కు వెళ్లినట్టే వెళ్లేవాణ్ని. ఇంకా పూర్తి వివరాలు తర్వాత చెబుతాను’ అని నాగబాబు చెప్పారు. 

ఈ వీడియోపై ఆయన అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘మీరు లేని జబర్దస్త్ చూడలేం. ఆ కార్యక్రమం పతనం మొదలైంది’ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే నాగబాబు జబర్దస్త్‌కు టాటా చెప్పి ఏ కార్యక్రమం చేస్తున్నారు అనే సమాధానానికి ఓ సమాధానం దొరికింది. జీ తెలుగు చానల్‌లో కొత్త కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో నాగబాబు ప్రత్యక్షం అయ్యారు. ఆయనతో పాటు అనసూయ కూడా మెరిసింది. ‘సరె సర్లే ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి’ అనే కార్యక్రమం తాలూకు ప్రోమోలో నాగబాబుతో యాంకర్ ప్రదీప్, రవి, అనసూయ, దేత్తడి హారిక మెరిశారు. ‘పల్లెటూరి నుంచి వచ్చాడు. పద్థతి మార్చుకుని ఉంటాడు. పంచెగట్టుకు వచ్చాడు.. పంచెగట్టడం మర్చిపోయాడు అని అనుకుంటన్నారేమో.. అదే రక్తం, అదే పౌరుషం.. ఒక్కొక్కడికి చిరిగిపోద్ది కామెడీగాళ్లకి’ అంటూ కమర్షియల్ డైలాగ్‌తో అదరగొట్టారు. దీంతో ఆయన కొత్త కార్యక్రమానికి ఫిక్సయ్యారని తెలుస్తోంది. 

ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఇది కూడా జబర్దస్త్ మాదిరి కామెడీ కార్యక్రమమే. చమ్మక్ చంద్ర, పటాస్ సద్దామ్, టిల్లు వేణు, కిరాక్ ఆర్పీలు మెరిశారు. మనం ఎన్నో అనుకుంటాం గానీ, జబర్దస్త్‌కు వీడ్కోలు చెప్పిన నాగబాబు సరే సర్లేతో ఎలా అలరిస్తారో చూడాలి.