అతని కళకు నమస్కరించాల్సిందే.. చెక్కపై గ్రామాన్నే చెక్కేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

అతని కళకు నమస్కరించాల్సిందే.. చెక్కపై గ్రామాన్నే చెక్కేశాడు..

September 27, 2020

కళాకారుడు అంతే.. కడుపు మాడ్చుకుని అయినా ఓ అద్భుతాన్ని సృష్టించగలడు. తన కళ కోసం రేయంబవళ్లు కష్టపడి అద్భుత కళాఖండాలను ఆవిష్కరించగలడు. అతను చేసిన కళాకృతులను చూసి ప్రజలు మెచ్చుకుంటే అతని ఆనందం నింగిని అంటడం ఖాయం. ఇతను ఓ శిల్పి. రోజూ కష్టపడితే గానీ అతని కుటుంబం ఆకలితో అలమటించదు. కుండలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయినా అతనిలో ఉన్న కళ అతన్ని ఓ పట్టాన ఉండనివ్వడం లేదు. ఓ కళాఖండాన్ని సృష్ఠించాలని అతని మనసు పదేపదే పోరింది. దీంతో అతను అప్పు తెచ్చుకొని మరీ అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించాడు. ఒక చెక్కపై గ్రామ దృశ్యాన్ని మొత్తం చెక్కేసి అందరినీ సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాడు. 

అతని పేరు నింగ్వాన్ జింగ్‌ఖైకు. నాగాలాండ్‌లో నివసించే అతనికి చిన్నప్పటినుంచే చెక్కతో అందమైన ఆకృతులు చెక్కే కళ అబ్బింది. ఈ నేపథ్యంలో ఒక చెక్క బల్లపై నమ్మశక్యంకాని రీతిలో విశాలమైన గ్రామ దృశ్యాన్ని చెక్కాడు. 

ఇళ్లు, గుడిసెలు, జలపాతం, లైట్లు, వంతెన, పొలాలు, బావులు, వీధులు ఇలా ప్రతీ అంశాన్ని ఎంతో క్షుణ్నంగా చెక్కి ఔరా అనిపించాడు. దానిని చూసి గ్రామస్తులందరూ ఎంతో మురిసిపోతున్నారు. నింగ్వాన్‌ను ప్రశంసిస్తున్నారు. ఆ కళాఖండానికి గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్‌గా మార్చేశాడు. ఇదంతా పూర్తిచేయడానికి అతడికి ఏడాది సమయం పట్టిందట. రూ.1.70 లక్షలు ఖర్చు అయిందని తెలిపాడు. అతని కళను జాతీయమీడియా గుర్తించింది. దీంతో ఇప్పుడతడు ఫేమస్‌ అయిపోయాడు. కాగా, ఆ కళాఖండాన్నిరూ.20 లక్షలకు విక్రయించి, ఆ మొత్తాన్ని తన కుటుంబ పోషణం కోసం ఉపయోగించుకుంటానని నింగ్వాన్ తెలిపాడు. భవిష్యత్తులో ఉక్రుల్ జిల్లాలోని ఫాంగ్రే పీఠభూమి వద్ద 100×50 మీటర్ల విస్తీర్ణంలో ఉన్న యేసుక్రీస్తు, అతడి 12 మంది శిష్యుల ప్రకృతి దృశ్యాన్ని చెక్కపై చెక్కాలనేది తన కల అని వెల్లడించాడు. చూడాలిమరి అతను చేసిన ఆ గ్రామ కళాఖండాన్ని ఎవరు దక్కించుకుంటారో.