బీజేపీకి నాగం గుడ్‌బై.. రేపోమాపో కాంగ్రెస్ చెంతకు! - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీకి నాగం గుడ్‌బై.. రేపోమాపో కాంగ్రెస్ చెంతకు!

March 22, 2018

ఊహించిందే జరిగింది. సీనియర్ రాజకీయ నేత నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు ఫ్యాక్స్‌లో పంపారు. ‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడ్డంలో బీజేపీ నేతలు విఫలమయ్యారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవనెత్తడం లేదు.. ఈ నేపథ్యంలో నా అభిమానులు, అనుచరుల మనోభావాల ప్రకారం రాజీనామా చేస్తున్నాను..’ అని వివరించారు. నిజానికి నాగం చాలాకాలం నుంచి బీజేపీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీ తనను చిన్నచూపు చూస్తోందని గుర్రుగా ఉన్నారు.

ఉగాది తర్వాత ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ఇటీవల వార్తలు వచ్చాయి. నాగం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలసి, పార్టీలో చేరికపై చర్చించినట్లు కథనాలు వెలువడ్డాయి. నాగం చేరికను రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే వీటిపై ఆయనేమీ స్పందించలేదు. రేవంత్ రెడ్డి టీడీపీని వదలి కాంగ్రెస్‌లో చేరాక పలువురు హస్తం బాటనో, లేకపోతే టీఆర్ఎస్ బాటనో పడుతున్న సంగతి తెలిసిందే.

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చొరవతో నాగం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం. 2012లో తెలంగాణ విషయంలో విభేదాలతో నాగం టీడీపీ నుంచ బైటకొచ్చారు. తర్వాత తెలంగాణ నగారా సమితిని ఏర్పాటు చేసుకున్నారు. అది ప్రభావం చూపకపోవడంతో బీజేపీలో చేరి, 2014 ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు.