Nagaraju family died in Serilingampally
mictv telugu

భార్య శారీరకంగా దూరం పెట్టిందని మంచి మనసున్న భర్త ఏం చేశాడంటే

October 18, 2022

మంచి మనసున్న భర్తను భార్య శారీరకంగా దూరం పెట్టడం దారుణానికి దారి తీసింది. అల్లారు ముద్దుగా పెంచుకునే పిల్లలను చేతులారా చంపేంత కఠినాత్ముడిగా మార్చింది. హైద్రాబాద్ శేరిలింగంపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన హత్యల వెనుక పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌కు చెందిన నాగరాజు (42) నగరంలో నివసిస్తూ కిరాణ దుకాణాలకు సరుకులు సరఫరా చేస్తుంటాడు. భార్య కుట్టు మిషన్‌తో పాటు చిన్న మొత్తాలను వడ్డీలకు ఇస్తూ ఉంటుంది. ఇద్దరు పిల్లలు చదువుకుంటుండగా, నాగరాజు గత నెల రోజులుగా పని మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

అయితే శుక్రవారం సాయంత్రం తలుపులు వేసుకున్న తర్వాత ఎవరూ బయటకు రాలేదు. ఇలా ఆదివారం వరకు గడచింది.
నాగరాజు కుటుంబం పూర్తిగా శాఖాహారులు కావడంతో ఆదివారం మాంసం వాసన రాకుండా ఉండడానికి తలుపులు వేసుకోవడం అలవాటే. అయితే అనుమానం వచ్చిన తర్వాత సోమవారం తలుపులు తెరచి చూడగా, నలుగురి మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. నాగరాజు భార్య నెల రోజులుగా శారీరకంగా దూరం పెట్టిందని, వడ్డీలకు ఇచ్చే రుణాల విషయంలో సాయం పేరుతో ఓ వ్యక్తి భార్యతో సన్నిహితంగా ఉండడం వీరి మధ్య మరింత దూరం పెంచిందని స్థానికులు వెల్లడించారు. అంతేకాక, నాగరాజుపై భార్య గట్టిగా అరిచేదని, తర్వాత తనను చంపుతాడనే భయం వ్యక్తపరచేదని చెప్తున్నారు. దీంతో మానసికంగా ఇబ్బంది పడిన నాగరాజు భార్యను, పిల్లలను చంపి తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంత అర్ధరాత్రి అయినా పిల్లలు ఆకలి అంటే ఏదో ఒకటి వండి పెట్టేవాడని, పిల్లలను అల్లారుముద్దుగా చూసుకునే ఇంతకు తెగిస్తాడని అనుకోలేదని ఇరుగుపొరుగు ఆవేదన వ్యక్తం చేశారు.