nagarjuna out from bigg boss season 7 hosting
mictv telugu

నాగార్జున కి బిగ్ షాక్.. హోస్టుగా బాలకృష్ణ ?

December 19, 2022

తెలుగు బిగ్ బాస్ పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడో విదేశాల్లో బిగ్ బ్రదర్ పేరుతో మొదలైన ఈ బిగ్ బాస్ షో అనేక భాషల్లో కొనసాగుతూ 2017లో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా, రెండో సీజన్‌కు హీరో నాని.. ఆ తర్వాత వరుసగా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక నిన్నటితో సీజన్ 6 ముగిసి.. వచ్చే ఏడాది సీజన్ 7 జరగబోతోంది. ఈ నేపథ్యంలో సీజన్ 7కి ఇంకా ఏడాది సమయం ఉండగానే కొత్త హోస్ట్ పై సంచలన నిర్ణయాలు లీక్ అవుతున్నాయి. సీజన్ 6 చప్పగా సాగిందన్న అసంతృప్తి నేపథ్యంలో నాగార్జునకి బిగ్ బాస్ యాజమాన్యం బిగ్ షాక్ ఇచ్చే దిశగానే ఈ లీకులు ఇస్తున్నారని అంటున్నారు. సీజన్ 6 టీఆర్పీలు లేకపోవటమే హోస్ట్ మార్పుకి కారణమని అంటున్నారు. దీంతో సీజన్ 7కి హైప్ తీసుకొచ్చే క్రమంలో అప్పుడే ఓ హాట్ న్యూస్ బయటకు వచ్చింది. నాగార్జున బిగ్ బాస్ 7కి హోస్ట్ గా వ్యవహరించడం లేదని, హోస్ట్ స్థానం నుంచి నాగ్ తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నాగార్జున స్థానంలో బాలకృష్ణ పేరు తెరపైకి వస్తుంది.

అన్ స్టాపబుల్ షోతో డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో భారీ క్రేజ్ దక్కించుకున్న బాలకృష్ణ కానీ హోస్ట్‌గా చేస్తే బిగ్ బాస్ సీజన్ 7 రూపురేఖలు మారిపోతాయని యాజమాన్యం భావిస్తోందట. సీజన్ 1కి ఎన్టీఆర్ ద్వారా వచ్చిన గుర్తింపు మళ్ళీ రాలేదని.. బాలయ్య హోస్టింగ్ తో తెలుగు బిగ్ బాస్ కి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. ఇప్పటికే బాలయ్య సన్నిహితులతో చర్చలు కూడా మొదలయ్యాయని అంటున్నారు. ఇక బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే ఆ స్థానంలో రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ 6 రేటింగ్స్ కంటే ఆహాలో అన్ స్టాపబుల్ షోకే గుర్తింపు ఎక్కువ రావటంతో బాలయ్యనే బిగ్ బాస్ కి ఫస్ట్ ఆప్షన్ అంటున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే.. సీజన్ 6లో రాజకీయాలు నాగ్ కి నచ్చలేదంట. 14వ వారంలో ఇనయా ఎలిమినేషన్, హౌజ్ లో కొందరి కోసం పాలిటిక్స్ జరగడంలాంటి విషయాలు నాగార్జునకు చిరాకు తెప్పించాయట. దాంతో వచ్చే సీజన్ హోస్ట్ చేయలేనని నాగార్జుననే స్వచ్ఛదంగా తప్పుకోబోతున్నట్టు రూమర్స్ కూడా ఉన్నాయి.