టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత

December 1, 2020

photod

టీఆర్ఎస్ నేత, నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇక లేరు. ఆయన ఈ రోజు వేకువజామున హైదరాబాద్‌లో శ్వాస సమస్యతో కన్నుమూశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హుటాహుటిన హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన అక్కడే చికిత్స పొందుతూ చనిపోయారు. నర్సింహయ్య వయసు 64 ఏళ్లు. ఆయన అంత్యక్రియలు బుధవారం నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామంలో నిర్వహించనున్నారు. 

నర్సింహయ్య 1956లో ఉమ్మడి నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో జన్మించారు. కమ్యూనిస్టు పార్టీపై మొగ్గుచూపిన ఆయన సీపీఐలో చేరారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చేసిన నర్సింహయ్య కొన్నాళ్లు న్యాయవాదిగా పనిచేశారు. నకిరేకల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 నుంచి 2009 వరకు పదేళ్లపాటు శాసనసభలో పీఐ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రభావంతో 2013లో టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నర్సింహయ్య 2018 ఎన్నికల్లో విజయం సాధించారు.