Nagarjuna talking to the media about the film Ghost
mictv telugu

రైతుల్లాంటి పరిస్థితి మాది.. రాజమౌళి సైతం ఇలా.. : నాగార్జున

July 10, 2022

ఏ పంట వేస్తే ఏ రేటు ఉంటుందో తెలియని రైతుల్లాగా మా సినీ ఇండస్ట్రీ పరిస్థితి ఉందని సినీ హీరో అక్కినేని నాగార్జున వ్యాఖ్యానించారు. ఆయన తాజాగా నటిస్తున్న ఘోస్ట్ చిత్రం ప్రమోషన్ సందర్భంగా మీడియాతో ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో తన అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు. ‘సినిమా పరిశ్రమలో ఏ సినిమా హిట్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రేక్షకుల నాడి పట్టుకోవడం తెలిస్తే ప్రతీ ఒక్కరూ నెంబర్ వన్ అవుతారు. నా కెరీర్‌లో శివ, అన్నమయ్య సినిమాల్లాగా అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటాను. కానీ అలా జరగదు. రామ్ గోపాల్ వర్మతో శివ హిట్ అయ్యిందని ఆఫీసర్ చేశా. అది ఫ్లాప్ అయింది. కృష్ణవంశీతో మొదట నిన్నే పెళ్లాడుతా చేశా. తర్వాత చంద్రలేఖ తీస్తే అది ఫెయిల్ అయింది. మరి నువ్వెలా సక్సెస్ అవుతున్నావని రాజమౌళిని అడిగా, దానికి ఆయన మనం తీసే సినిమాల పట్ల మనకు ప్రేమ ఉండాలని చెప్పారు. ఇష్టంతో తీస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు నేను నటించిన ఘోస్ట్ సినిమాలోని యాక్షన్ సీన్స్ ఎవ్వరూ ఊహించనట్టుగా ఉంటుంది. పేరు చూసి ఇది దెయ్యం సినిమా అనుకోకండి. అది సినిమాలో కోడ్ నేమ్. మంచి సెంటిమెంట్లు ఉన్న సినిమా ఇది’ అని తెలిపారు. కాగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున విక్రమ్ అనే ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది.