పెరుగుతున్న వాతావరణమో, పరిస్థితుల ప్రభావమో.. లేదంటే సమాజంలో వింత పోకడలో కారణం తెలియదు కానీ 15 ఏండ్ల బాలిక వయస్సుకు మించిన ఘనకార్యం చేసింది. అంతకు మించి తాను జన్మనిచ్చిన ఓ శిశువును చంపి దారుణానికి పాల్పడింది. తల్లిదండ్రులను మోసం చేస్తూ, శారీరక వాంఛ తీర్చుకునేందుకు.. ఇలా రకరకాలుగా ప్రవర్తిస్తూ అమాయకత్వంతో తనకు తానే మోసం చేసుకుంది. 15 ఏండ్ల వయస్సు ఉన్న ఆ అమ్మాయి ఆలోచన విధానం చూస్తే.. సమాజంలో ఇలాంటి పరిస్థితులకు కారణమేంటనే ప్రశ్నలు తలెత్తక మానవు.
మహారాష్ట్రలోని నాగ్‌పుర్ నగరం స్థానిక అంబజారీ ప్రాంతానికి చెందిన బాలికకు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతనితో ఏకాంతంగా గడిపి గర్భం దాల్చింది. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. నెలలు నిండుతున్న కొద్దీ పొట్ట పెద్దగా కనిపించడంతో తల్లికి అనుమానమొచ్చింది. ఏంటని ప్రశ్నించగా.. అనారోగ్యమే కారణమంటూ ఏమార్చింది. ఇక నెలలు నిండాక ఆ బిడ్డను ఎలా వదిలించుకోవాలనే అలోచనతో యూట్యూబ్ లో సెర్చ్ చేసింది.
అందులో డెలివరీ ఎలా చేసుకోవచ్చో పలు వీడియోలను చూస్తూ తెలుసుకుంది. ఈ నెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే ఆ పసిగుడ్డును గొంతునులిమి చంపేసింది. ఇంట్లోనే ఓ పెట్టెలో మృతదేహాన్ని దాచిపెట్టింది. పనిమీద బయటకు వెళ్లిన తల్లి తిరిగొచ్చేసరికి బాలిక అనారోగ్య స్థితిలో కనిపించింది. ఆమె గట్టిగా ప్రశ్నించడంతో.. మొత్తం విషయాన్ని చెప్పేసింది. శిశువు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించామని పోలీసులు తెలిపారు.