దొంగతనం కేసులో అరెస్ట్.. బెయిల్ తర్వాత అదే లారీతో పరార్ - MicTv.in - Telugu News
mictv telugu

దొంగతనం కేసులో అరెస్ట్.. బెయిల్ తర్వాత అదే లారీతో పరార్

October 20, 2020

Sanjay Dene

ట్రక్ దొంగతనం కేసులో అరెస్టు అయిన ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ స్టేషన్ ముందు నిలిపిన వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. ఏ దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్నారో, అదే లారీతో మళ్లీ ఉడాయించాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సోమవారం ఈ సంఘటన జరిగింది. అతడి చర్యతో పోలీసులే కంగుతిన్నారు. సీజ్ చేసిన వాహనం ఎత్తుకెళ్లడంతో అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. 

సంజయ్ ధోనే అనే వ్యక్తి అక్టోబర్ 11న ఓ లారీని దొంగతనం చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న ట్రక్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి సీజ్ చేసి అక్కడే నిలిపారు. సోమవారం బెయిల్ రావడంతో విడుదలైన ధోనే.. మళ్లీ తిరిగి తన దొంగ తెలివి బయటపెట్టాడు. అదే వాహనాన్ని ఎత్తుకొని పారిపోయాడు. అడ్డు తగిలిన కాపలా సిబ్బందిపై దాడి చేసి మరీ తీసుకెళ్లాడు. కాగా, గజదొంగపై ఇప్పటికే 20 వాహనాలు చోరీ చేసినట్టు రికార్డులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ దొంగతనం కేసు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.