Nagula Sai was remanded by the Himayat Nagar police
mictv telugu

నా భార్యనే పెళ్లి చేసుకొని పైగా చెల్లీ అని పిలవమంటావా

November 16, 2022

హైదరాబాద్ నగరం నారాయణ గూడ మెట్రో స్టేషన్ వద్ద ఈ నెల 7న నాగరాజు కుటుంబంపై నాగులసాయి అనే వ్యక్తి పెట్రోల్ పోసి తగులబెట్టేశాడు. ఘటన అనంతరం నిందితుడు నల్గొండకు పారిపోగా పోలీసులు అక్కడికి వెళ్లి తీసుకొని వచ్చి మంగళవారం రిమాండుకు తరలించారు. అక్కడ విచారణలో నాగులసాయి కీలక విషయాలు బయటపెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాకకు చెందిన రావుల సాయి అలియాస్ నాగుల సాయి ఫంక్షన్లలో బ్యాండ్లు వాయించేవాడు. ఖాళీగా ఉన్నప్పుడు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో చిక్కడపల్లికి చెందిన ఆర్తీ పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకొని 2014లో వివాహం చేసుకున్నారు. దంపతుల కాపురానికి ఓ కుమారుడు పుట్టాడు. అయితే కాలక్రమేణా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆర్తి అన్న జితేంద్రతో గొడవ కారణంగా నాగుల సాయి ఓ ఏడాది జైలు శిక్ష కూడా అనుభవించాడు. తర్వాత కోర్టు ధిక్కారం కేసులో మరో ఏడాది జైలు జీవితం గడిపాడు.

ఈ గ్యాపులో ఆర్తీకి అన్న జితేంద్ర భార్య నాగరాజును పరిచయం చేసింది. తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోగా, వారికి పది నెలల కుమారుడు విష్ణు ఉన్నాడు. ఆర్తి మళ్లీ గర్భం దాల్చింది. ఈ పరిస్థితుల్లో జైలు నుంచి విడుదలైన నాగులసాయి కాపురానికి రమ్మని ఆర్తిని కోరగా ఆమె నిరాకరించింది. అంతేకాక, ఆమె రెండో భర్త నాగరాజు.. తన భార్య ఆర్తీతో మాట్లాడినా, ఫోన్ చేసినా ఊరుకునేది లేదని బెదిరించాడు. అంతటితో ఆగక.. ఇప్పుడు ఆమె నీకు చెల్లి వరుస అవుతుంది కాబట్టి చెల్లీ అని పిలవాలని చెప్పాడు. దీంతో కోపగించుకున్న నాగులసాయి నా భార్యను పెళ్లి చేసుకోవడమే కాకుండా పైగా భార్యను చెల్లీ అని పిలవమంటావా అని మనసులో పగ పెంచుకున్నాడు. ముగ్గురినీ ఒకేసారి చంపాలనుకొని తగిన సమయం కోసం వేచి చూశాడు. ఈ నెల 7న మెట్రో పిల్లర్ కింద ముగ్గురూ కలిసి ఉన్నప్పుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మరుసటి రోజు పది నెలల కుమారుడు విష్ణు మరణించగా, రోజుల వ్యవధిలో నాగరాజు చనిపోయాడు. ఆర్తీ గర్భంలోని ఐదు నెలల శిశువు కూడా మృతి చెందింది. ఆర్తీ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని పోలీస్ అధికారి రాపోలు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.