నెయిల్ పాలిష్.. షాంపూల్లో సువాసనలు వెదజల్లడానికి ఉపయోగించే రసాయనలు మహిళల్లో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన శాస్రవేత్తల బృందం ఈ విషయం మీద పరిశోధనలు చేపట్టింది. ఆరేండ్లలో 1300మంది మధ్య వయస్కులైన మహిళలపై ఈ పరిశోధనలు జరిపారు. వారి ట్రాక్ పరిశీలించిన ఆ బృందం నెయిల్ పాలిష్, షాంపూలు బహిర్గతం చేసే రసాయనల వల్ల మహిళల్లో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 63శాతం ఎక్కువగా ఉందని కనుగొన్నారు.
ఇతర ఉత్పత్తుల్లో..
నెయిల్ పాలిష్.. షాంపూల్లో థాలేట్స్, ప్లాస్టిక్ లను మరింత మన్నిక చేయడానికి ఈ రసాయనాలను ఉపయోగిస్తారు. వాటిని ప్లాస్టిసైజర్స్ అని కూడా పిలుస్తారు. ఈ రసాయనాలు చర్మం ద్వారా లోపలికి వెళ్లి కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు.. ఇతర అవయవాలకు హాని కలిగిస్తాయంటున్నదీ బృందం. వీటిలోనే కాదు.. ఇతర సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఈ రసాయనాలు ఉండడం గమనించామంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ రసాయనాలు క్యాన్సర్, గర్భాశయ కణితులకు కూడా కారణం అవ్వొచ్చనే దిశగా వీరి పరిశోధన సాగుతున్నది. అయితే ఇది ఇంకా క్లినికల్ గా రుజువు కాలేదు.
ఇవే కాకుండా..
శాస్త్రవేత్తల ప్రకారం.. విషపూరిత రసాయనాలు ఇన్సులిన్, గ్లూకాగాన్ హార్మోన్లకు అంతరాయం కలిగించగలవు. కాబట్టి ఇవి మధుమేహానికి కారణం కావచ్చు. ఈ హార్మోన్లు కణాల్లో ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా శ్వేతజాతీయుల్లో ఎక్కువగా రావడం గమనించామని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన మిచిగాన్ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ సుంగ్ క్యున్ పార్క్ ఒక నివేదిక ద్వారా ఉదహరించారు. కేవలం ఇవే కాకుండా.. ఊబకాయం, సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి సమస్యలు కూడా ఆడవాళ్లలో టైప్ 2 డయాబెటిస్ కి కారణం అవ్వచ్చని ఈ డాక్టర్ చెప్పారు.