హైదరాబాద్ నగరం గోషా మహల్ ఏరియాలోని చాక్నవాడిలో పెద్ద నాలా ఉన్నట్టుండి కూలిపోయింది. దానిపై ఉన్న వాహనాలు, కూరగాయల బండ్లు, బైకులు ధ్వంసమయ్యాయి. కొన్ని స్వల్పంగా దెబ్బతిన్నాయి. శుక్రవారం కావడంతో మార్కెట్ రద్దీగా ఉండగా, ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్పరిణామానికి ప్రజలు హడలిపోయారు. కొందరికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే చేరుకున్న పోలీసులు జనాన్ని తరలించగా, డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. కాంక్రీట్ లోపం కారణంగానే నాలా 12 అడుగుల లోతుకు కూలిపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలా మీద సిమెంట్ స్లాబ్ వేసి దానిపై రోడ్డు వేయగా, దీని మొత్తం పొడవు 70 అడుగులు ఉంది. ఇక ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్ పరిస్థితిని సమీక్షించారు. తాజా ఘటనతో ఎక్కడ ఏ నాలా కూలుతుందోనని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు