పిల్లలపై కనిపెట్టుకుని ఉండండి.. లేకపోతే ఇలాంటి కడుపుకోతే.. - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లలపై కనిపెట్టుకుని ఉండండి.. లేకపోతే ఇలాంటి కడుపుకోతే..

March 17, 2018

చిన్నపిల్లలకు ఈ సృష్టిలో ప్రతి ఒక్కటీ ఆసక్తికరమే. ఎగిరే పిట్ట, పరిగెత్తే కుక్కపిల్ల, ఉరికే చేపపిల్ల.. అన్నీ వారికి సంబరం కలిగిస్తాయి. అందుకే పెద్దలకు చిక్కకుండా అటూ ఇటూ పరిగెడుతూ లోకాన్ని ఆన్వేషిస్తుంటారు. ఈ సంగతి పెద్దలు జాగ్రత్తగా గమనించాలి. పిల్లలు ఎక్కడికి పోతున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరితో వెళ్తున్నారు? అన్నీ తరచి తరచి విచారించుకోవాలి. లేకపోతే ఇలాంటి పెను విషాదాలు జరిగే ప్రమాదం ఉంది.

ఈతకు వెళ్లిన ఆరేడేళ్ల పసిపిల్లలు చెరువులో మునిగి చిన్ని ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లి మండలం పెండ్లి పాకల గ్రామంలో జరిగింది. శనివారం ఐదుగురు బాలురు ఒంటిపూట బడి అయిపోయాక స్థానిక చెరువుకు వెళ్లారు. ఈతరాని, ఈతకొట్టే వయసులేని పిల్లలు కావడంతో నీటిలో మునిగిపోయి విగతజీవులయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లల కావడంతో ఆ కుటుంబాలు తీరని కడుపుకోతతో తల్లడిల్లిపోతున్నాయి. మృతులను ఓంకార్ కొడుకులు సంతోశ్(7), రాకేశ్(6), హన్మ కొడుకులు నవదీప్ (7), సాత్విక్(6), సర్దార్ బిడ్డ శివ (6)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.