Nalgonda: Terrible tragedy..Mother and daughter died
mictv telugu

నల్గొండ: ఘోర విషాదం..తల్లీ, కూతురు మృతి

July 9, 2022

Nalgonda: Terrible tragedy..Mother and daughter died

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని పద్మానగర్‌లో ఘోర విషాదం జరిగింది. శుక్రవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి తల్లి, కూతురు ఇద్దరు ఒకేసారి మృతి చెందిన సంఘటన చుట్టుపక్కల ఉన్న స్థానికుల్లో విషాదాన్ని నింపింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండు నెలల క్రితమే పెళ్లి చేసిన తల్లి.. ఆషాఢ మాసం కావడంతో బిడ్డను వారం కిందే తన వద్దకు తీసుకొచ్చింది. ఈ క్రమంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా గురువారం రాత్రి అన్నం తిని, ముచ్చట్లు చెప్పుకొంటూ పడుకొన్న తల్లి, కూతుర్లు శుక్రవారం ఉదయం కురిసిన భారీ వానకు మట్టిగోడ తడిసిపోయి ఒక్కసారిగా ఇల్లు కూలిపోవడంతో ఇద్దరు బయటికి వెళ్లలేక కూరుకుపోయి అక్కడికక్కడే కన్నుమూశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..”మృతులు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం మాకివలస గ్రామానికి చెందిన నడిపూరి లక్ష్మి (47), ఆమె కుమార్తె కల్యాణి (21)గా గుర్తించాం. మాకివలసకు చెందిన లక్ష్మి భర్త నాయుడు ఆర్థిక ఇబ్బందులతో పదేళ్ల కింద ఆత్మహత్య చేసుకు న్నాడు. దీంతో పిల్లలు భాస్కర్‌రావు, కల్యాణి ఇద్దరినీ ఆమెనే పోషిస్తోంది. నల్లగొండలోని పద్మా నగర్‌కు వలస వచ్చి, మూడేళ్లుగా రైల్వే కూలీలకు వంట చేసి పెడుతూ జీవిస్తున్నారు. కల్యాణికి మే 14న శ్రీకాకుళం జిల్లా ధర్మూర్‌ మండలానికి చెందిన బంధువుల అబ్బాయి శ్రీనుతో వివాహం జరిగింది. బిడ్డ, అల్లుడు శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటున్నారు. ఆషాఢ మాసం కావడంతో కల్యాణి వారం క్రితమే తల్లి దగ్గరికి వచ్చింది. శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో కుమారుడు బయటపడ్డాడు” అని వివరాలను వెల్లడించారు. మృతదేహాలను అంత్యక్రియల కోసం స్వగ్రామానికి బంధువులు తీసుకెళ్లనున్నట్లు పోలీసులు తెలిపారు.