నమస్తే ట్రంప్ వల్లే దేశంలో కరోనా వ్యాప్తి - MicTv.in - Telugu News
mictv telugu

నమస్తే ట్రంప్ వల్లే దేశంలో కరోనా వ్యాప్తి

May 31, 2020

MP Sanjay Raut.

ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లిన తబ్లీఘీ జమాత్‌ల వల్లే దేశంలో కరోనా వ్యాపించిందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే అంతకన్నా ముందే జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమం వల్లే దేశంలో కరోనా వ్యాప్తి చెందిందని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుజరాత్‌లోని అమ్మదాబాద్‌లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమం వల్లే దేశంలో కరోనా వ్యాపించిందని ఆరోపించారు. ఆ కార్యక్రమం వల్ల మొదట గుజరాత్‌లోకి వైరస్‌ వచ్చిందని, అక్కడి నుంచి మహారాష్ట్ర, ఢిల్లీలకు వ్యాపించిందని తెలిపారు. ఎలాంటి ఉపాయం లేకుండా లాక్‌డౌన్‌ను విధించిన కేంద్ర ప్రభుత్వం.. ఎత్తేసే బాధ్యతను మాత్రం రాష్ట్రల పైకి నెట్టేసి తప్పించుకుంటోంది అని రౌత్‌ మండిపడ్డారు. 

మరోవైపు ఇటీవల మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై మాట్లాడుతూ.. ‘మహా వికాస్‌ ఆఘాడీ కూటమిలో ఉన్న వాళ్లంతా ఏకతాటిపై ఉన్నారు. ప్రతిపక్ష బీజేపీ అనవసరంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రత్నిస్తోంది. కరోనా వైరస్ విజృంభణ వంకతో  ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రపతి పాలన తీసుకురావాలని చూసింది. అయినా మాకు ఎలాంటి ముప్పు లేదు. మహమ్మారి కట్టడిలో భాగంగా రాష్ట్రపతి పాలనే ధ్యేయమైతే దేశంలోని 17 రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది. కేంద్రం వైరస్‌ను కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం అయింది. ప్రభుత్వంలో అంతర్గత కలహాలు ఉన్నాయన్న మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నా. అంతర్గత కలహాలు ఉన్నప్పటికీ బీజేపీ–శివసేన ప్రభుత్వాన్ని నడిపించలేదా? కూటమిని ఏర్పాటు చేయడంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌‌ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికీ ఆయన సారథ్యంలో కూటమి బలంగా ఉంది’ అని రౌత్ అన్నారు.