క్లాసులో నమాజ్.. విచారణకు ఆదేశించిన యూనివర్సిటీ - MicTv.in - Telugu News
mictv telugu

క్లాసులో నమాజ్.. విచారణకు ఆదేశించిన యూనివర్సిటీ

March 26, 2022

mmmm

విద్యాలయాల్లో మతపరమైన వివాదాలు ఇప్పట్లో అంతమయ్యేలా కనిపించడం లేదు. కర్ణాటకలో మొదలైన ఇలాంటి వివాదాలు మెల్లగా దేశమంతటా పాకుతున్నాయా? అనే అనుమానం కలుగక మానదు. మధ్యప్రదేశ్‌లో ఓ యూనివర్సిటీలో జరిగిన ఘటన ఇలాంటి అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. అక్కడి డాక్టర్ హరిసింగ్ గౌర్ యూనివర్సిటీలో హిజాబ్ ధరించిన ఓ విద్యార్ధిని తరగతి గదిలోనే నమాజ్ చేసింది. దీన్ని వీడియో తీసిన హిందూ జాగరణ మంచ్.. వీడియోతో యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఆమె మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై రిజిస్ట్రార్ సంతోష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఫిర్యాదుపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఫిర్యాదుతో పాటు వీడియో కూడా అందిందని, ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీ వేశామన్నారు. కమిటీ నివేదిక మూడ్రోజుల్లో వస్తుందనీ, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా, హిజాబ్ వివాదంపై సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.