మజ్లిస్ కీలక నేత అక్బరుద్దీన్ ఓవైసీకి భారీ ఊరట లభించింది. గతంలో ఆయన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులను బుధవారం నాంపల్లి కోర్టు కొట్టివేస్తూ, తుది తీర్పు చెప్పింది. అంతేకాకుండా ఈ కేసులో అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
అయితే, అక్బరుద్దీన్ ఓవైసీ 2012 డిసెంబర్ నెలాఖరులో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించారు. ఆ పర్యటనలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో భాగంగా 2013లో అక్బరుద్దీన్ అరెస్ట్ అయ్యారు. కొద్ది రోజుల తర్వాత బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. ఆనాటి నుంచి ఈనాటీ వరకూ ఆయన కేసును నాంపల్లి కోర్టు విచారిస్తూ వచ్చింది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించిన విచారణను ముగించామని..ఈనెల 12వ తేదీన తుది తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. అయితే, మంగళవారం తీర్పును మరోమారు వాయిదా వేసింది. బుధవారం తన తుది తీర్పును వెలువరించింది.
అంతేకాకుండా కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్‌కి న్యాయమూర్తి పలు సూచనలు చేశారు. ”భవిష్యత్తులో ఎలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయరాదు. అలాంటి ప్రసంగాలు దేశ సమగ్రతకు మంచిది కాదు. ఈ తీర్పును మీ విజయంగా పరిగణించరాదు. ఎలాంటి సంబరాలకు అనుమతి లేదు” అని స్పష్టంగా చెప్పారు.