‘మొగుడిని ఎలా చంపాలి?’ రచయిత్రికి జీవిత ఖైదు.. - MicTv.in - Telugu News
mictv telugu

‘మొగుడిని ఎలా చంపాలి?’ రచయిత్రికి జీవిత ఖైదు..

June 14, 2022

‘వంటలు ఎలా చెయ్యాలి?’ టైపులో ‘మొగుడిని ఎలా లేపేయాలి?’ అని పుస్తకం రాసిన మహిళ పాపం పండింది. ‘హై టు మర్డర్ యువర్ హజ్బెండ్?’ రచయిత్రి నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ(71)కి అమెరికాలోని ఒరెగాన్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. భర్తను కాల్చి చంపిన కేసులో ఆమెకు ఈ శిక్ష పడింది. నాన్సీ 2018లో భర్త డేనియల్‌ను అతడు పనిచేస్తున్న కార్యాలయానికే వెళ్లి హతమార్చింది. అతడు నీటి సింక్ దగ్గర ఉండగా ఈ మహా రచయిత్రి వెనక నుంచి తుపాకీతో కాల్చేసింది. కిందపడి విలవిల కొట్టుకుంటున్న భర్తను ఏ మాత్రం కనికరం లేకుండా గుండెల్లో కాల్చేసింది. భర్త పేరుతో ఉన్న 15 లక్షల డాలర్ల సొమ్ముకోసం ఈమె ఈ హత్యకు తెగబడింది. హత్యకు ఏడేళ్ల ముందే నాన్సీ ‘మొగుడిని ఎలా?’ పుస్తకం రాసింది.

తనకు నేరాల గురించి తెలుసుకోవాలని ఆసక్తి తప్ప మరే దురుద్దేశమూ లేదని హత్య కేసులో ఆమె వాదించింది. అందులో భాగంగానే తుపాకీ కొన్నానని బొంకింది. నాన్సీకి తన భర్తపైనే కాకుండా లోకంలోని భర్తలందరిపైనా కోపం. ఆమె కలం నుంచి ‘ద రాంగ్ హజ్బెండ్’, ‘ద రాంగ్ లవర్’ అనే ఆణిముత్యాల నవలలు జాలువారినా పాఠకులు పెద్దగా పట్టించుకోలేదు. నాన్సీ తన రచన కౌశలాన్ని దుర్వినియోగం చేయకుండా దాంపత్య సమస్యల పరిష్కారానికి కృషి చేసి ఉండాల్సిందని నెటిజన్లు అంటున్నారు.