Nancy Pelosi lands in Taiwan
mictv telugu

తైవాన్‌లో అడుగుపెట్టిన నాన్సీ పెలోసి.. భగ్గుమన్న చైనా

August 3, 2022

తైవాన్‌లో పర్యటిస్తే తీవ్ర పరిణామాలుంటాయని చైనా చేసిన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసి మంగళవారం తైవాన్‌లో అడుగుపెట్టారు. ఆమె ప్రయాణిస్తున్న విమానం తమ గగనతలంలోకి ప్రవేశించగానే తైవాన్ యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా వచ్చాయి. తైపీలో దిగేంతవరకు రక్షణ కల్పించాయి. తర్వాత తైవాన్ ప్రెసిడెంట్‌తో పెలోసి భేటీ అయ్యారు. తైవాన్ విషయంలో తమ అభిప్రాయం మారదని ఆమె స్పష్టం చేశారు. ఈ పర్యటనపై అమెరికా డేగకన్నుతో నిఘా వేయగా, తైవాన్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొంది. అటు పర్యటనన వ్యతిరేకిస్తున్న చైనా అమెరికా తీరుపై మండిపడింది. ఈ పరిణామం గతంలో ఇరుదేశాల మధ్య కుదిరిన మూడు ఒప్పందాలకు విరుద్ధమని ప్రకటించింది. ఒకే చైనా పాలసీకి వ్యతిరేకంగా అమెరికా నడుచుకుంటుందన్న భావన చైనా ప్రజల్లో కలుగుతోందని అధికారిక మీడియా పేర్కొంది. అంతేకాక, చైనా రక్షణ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. కాగా, గత పాతికేళ్లలో అమెరికాకు చెందిన ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి తైవాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన 21 మిలటరీ విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించాయని తైవాన్ ఆరోపించింది. ఇదిలా ఉండగా, ఏమైనా దుష్పరిణామాలు తలెత్తితే ఎదుర్కొనడానికి పసిఫిక్ సముద్రంలో అమెరికా దళాలు సిద్ధంగా ఉన్నాయి. కాగా, ఈ తాజా పరిణామంతో మూడో ప్రపంచ యుద్ధం వస్తుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.