నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం క్షణక్షణానికి క్షీణిస్తోంది. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, మేనత్త పురందేశ్వరి తదితరులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. బాలకృష్ణ ఆస్పత్రిలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తారకరత్న మెలెనా అనే అరుదైన రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నట్టు చికిత్స అందిస్తున్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
తీవ్రమైన గుండెపోటు రావడంతో అంతర్గత రక్తస్రావం జరిగిందదని, జీర్ణాశయ అంతర్భాగంలో రక్తస్రావంగా పేర్కొనే అరుదైన మెలెనా వ్యాధితో ఆయన బాధపడుతున్నారని వివరించారు. ఈ స్థితిలో చికిత్స చేయడానికి కృత్రిమ శ్వాస అవసరమని పేర్కొన్నారు. మెలెనా వల్ల జీర్ణాశయంతోపాటు అన్నవాహిక, చిన్నపేగు, నోటిలో రక్తస్రావం జరుగుతుంది. కొన్నిసార్లు పెద్దపేగులోనూ రక్తం పడుతుంది.
జీర్ణాశయం దెబ్బతినడం, కడుపులో యాసిడ్ మోతాదుకన్నా ఎక్కువ ఉత్పత్తి కావడం, పుండ్లు, వాపు వంటివి దీని కారణం. ఫలితంగా మనిషి బలహీనపడ్డమే కాకుండా శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. దీనికి పలు రకాలు చికిత్సలు చేయాల్సి ఉంటుంది. ఒకపక్క గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ, మరోపక్క రక్తపోటును అదుపులో ఉంచాల్సి వస్తుంది. తారకరత్నకు ఈ చికిత్స అందిస్తున్నారు. గుండెకు రక్తం సరఫరా కావడానికి బెలూన్ యాంజియోప్లాస్టీ చేస్తున్నారు. తారకరత్న శుక్రవారం నారా లోకేశ్ పాదయాత్రలో స్పృహ తప్పిపడిపోవడం తెలిసిందే.