ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమించినట్టు తెలుస్తోంది. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు విదేశీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు. అయితే ఇన్ని రోజులుగా కోమాలో ఉండడంతో పాటు గత రెండ్రోజులుగా ఆరోగ్యం ఆందోళనకర స్థాయికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు శనివారం ఆస్పత్రికి తరలివెళ్లారు. వారితో నందమూరి బాలకృష్ణ తోడుగా ఉన్నారు. శనివారం లేదా ఆదివారం మధ్యాహ్నం తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటివరకు రెండు సార్లు బులెటిన్ రిలీజ్ చేయగా, ఆ రెండిట్లో కూడా పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని వెల్లడైంది. ముఖ్యంగా మెదడుకి సంబంధించి ఎలాంటి కదలికలు లేకపోవడంతో చికిత్స కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులు ఆస్పత్రికి వెళ్లడంతో నందమూరి అభిమానులతో పాటు టీడీపీ శ్రేణులు కూడా ఆందోళనలో ఉన్నారు. ఎలాంటి సమస్య లేకుండా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.