నంద్యాల్లో పెరిగిన పోలింగ్ పర్సేంటేజీతో లాభం ఎవరికి...... - MicTv.in - Telugu News
mictv telugu

నంద్యాల్లో పెరిగిన పోలింగ్ పర్సేంటేజీతో లాభం ఎవరికి……

August 24, 2017

నంద్యాల ఉప ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది.  ఇక్కడే చిక్కు వచ్చి పడింది. ఈ పెరిగిన పోలింగ్ గత చరిత్రను బ్రేక్ చేసింది. ఇరవై యేండ్ల కాలంలో ఇంత భారీ పోలింగ్ జరగ లేదని  విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ పెరిగిన పర్సేంటేజీ ఎవరికి  ప్రయోజనం అనేదే  అస్సలు ప్రశ్న. దీనిపై ఎవ్వరి అంచనాలు వారికున్నాయి. ఎవరి వాదనలూ వారికున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను  పోల్చి చూసుకుంటే  విషయం కాస్త అర్థం కావొచ్చు. రూరల్ లో పెరిగిన పోలింగ్ కొంత మేరకు జగన్ పార్టీకి  అనుకూలించే అంశం అంటున్నారు. అయితే  అర్బన్ లోనూ ఓటింగ్ బాగా పెరిగింది. ఇక్కడ డెవలప్మెంట్  పేరుతో ఇక్కడి ఓటర్లు సైకిల్ వైపు మొగ్గు చూపారనే వాదానా ఉంది.

80 శాతం వరకు పోలింగ్ పెరుగుతుందని పార్టీలకు కూడా అంచనా లేదు. అంచనా లేకుండా పెరిగిన ఈ ఓటింగ్  ఎవరికి లాభిస్తుందనే దానికి ప్రచారాలు, కులాల వారిగా, వ్యక్తుల వారిగా అంచనాలు వేసుకుంటున్నారు. ఎన్నికల ముందు నిర్వహించిన సర్వేల్లో  టిడిపి, వైసీపీలకు పోటాపోటీ ఉన్నట్లు వచ్చింది. ఆ తర్వాత  టిడిపి కి కాస్త ఎడ్జ్ ఉంటుందనే అంచనాలు వచ్చాయి. పోలింగ్ రోజున వైసీపీకి  అనుకూలంగా ఉందనే ప్రచారం జరిగింది. చివరకు ఇరు పార్టీల నాయకుల్లో తామే గెలుస్తామనే ధీమా మాత్రం కన్పించడం లేదు.

నంద్యాల రూరల్, అర్బన్, గోస్పాడు మండలాల్లో ఇంతకు ముందుకు ఇప్పటికీ ఓటింగ్ బాగా పెరిగింది. పొద్దున్నుండే ఓటర్లు  పోలింగ్ బూత్ ల ముందు లైన్లు కట్టారు.  సాధారణ ఎన్నికలను తలదన్నే రీతిలోప్రచారం జరిగింది. వంద కోట్ల కు పైగా డబ్బులు కుమ్మరించారనే ప్రచారమూ జరిగింది. ఎవరెంత ఖర్చు పెట్టినా ఓట్లు ఎవరి పెట్టెలో  రాలాయనేదే పాయింట్ ఇక్కడ.

పెరిగిన పర్సేంటీజీ వరకు చూసుకుంటే ఫ్యాన్  గుర్తుకు లాభిస్తుందని అంటున్నారు. అర్బన్ ఓటు బ్యాంక్ కూడా బాగానే ఉంది కాబట్టి  ఇది టీడీపికి కొంత మేరకు సానుకూలిస్తుందనే అభిప్రాయమూ ఉంది.ఎవరి అంచనాలు వారికున్నాయి. ఓటర్లకు ఈ విషయంలో బాగా క్లారిటీ ఉంది. బయట జరుగుతున్న ప్రచారాల సంగతి ఎట్లా ఉన్నా  ఓటర్లకు మాత్రం ఎవరిని గెలిపించాలనే విషయం బాగా తెల్సినట్లే ఉంది. ఈనెల 28 మధ్యాహ్నం వరకల్లా ఎవరు గెలుస్తారనేది స్పష్టం అవుతుంది.