నంద్యాల యువతకు ఏమైంది? - MicTv.in - Telugu News
mictv telugu

నంద్యాల యువతకు ఏమైంది?

August 23, 2017

ఓటు అంటే నంద్యాల యువత లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  ఓటువేయడానికి యువతీ యువకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.  పోలింగ్ బూతుకు వచ్చే వంద మందిలో కేవలం ఇద్దరంటే ఇద్దరే యువత కనిపిస్తున్నారు. ఎక్కువగా మహిళలు, వృద్ధులు, నడి వయసు వారే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. యువత మాత్రం ఏదో అరకొరగా వచ్చి ఓటు వేస్తున్నారు. నంద్యాలలో మొత్తం 2.19 లక్షల జనాభా ఉంది. అందులో 30 వేల నుంచి 40 వేల వరకు యువతీ యువకులు ఉన్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం కావస్తున్నా యువత మాత్రం పోలింగ్ బూతు వైపు తొంగి చూడడంలేదు. 90 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు సైతం ఎంతో కష్టపడి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటుంటే యువత మాత్రం ఎందుకు కదలి రావడంలేదని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ అంటే  యువతకు ఎందుకంత నిర్లక్ష్యం? పోలింగ్ బూతులు కూడా ఎక్కువగానే ఉన్నాయి.  కొత్త సినిమాలు చూడ్డడానికి టికెట్ల కోసం కిలోమీటర్ల మేర క్యూలలో గంటల కొద్దీ నిల్చుండే యువత.. కనీసం పదినిమిషాల సమయాన్ని ఓటు వెయ్యడానికి ఎందుకు వెచ్చించలేకపోతున్నారని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాలలో కొత్తగా 16000 మంది యువత ఓటు గుర్తింపు కార్డును తీసుకున్నారట, మరి వారందరు పోలింగ్ రోజున ఏం చేస్తున్నట్టు?

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం వివాదాస్పదంగా మారడం, పార్టీలు పలు అక్రమాలు పాల్పడ్డం కూడా యువత ఓటు వేయకపోవడానికి కారణంగా భావిస్తున్నారు. తాము ఓటేసినా అక్రమాల వల్ల ఫలితం ఉండదని, తమ అకాంక్షకు తగ్గట్టు తీర్పు రాదనే అనుమానంతోనూ యువత పోలింగ్ కు దూరంగా ఉంటున్నట్లు కొందరు చెబుతున్నారు.