భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో.. శ్రీశైలంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. రాష్ట్రపతి శ్రీశైలానికి వచ్చేటప్పుడు, తిరిగి వెళ్ళేటప్పుడూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు.
రాష్ట్రపతి ఈ ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు సున్నిపెంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వస్తారు. మార్గం మధ్యలో సాక్షి గణపతి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం శ్రీశైలం చేరుకుని భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుంటారు. అనంతరం ప్రసాద్ పథకం కింద రూ.43 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.10 గంటలకు రాష్ట్రపతి పర్యటన ముగియనుంది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం, లింగాల గట్టు వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.శ్రీశైలం వచ్చే వాహానాలకు ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతి లేదు.
కాగా.. రాష్ట్రపతి శ్రీశైలం పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ పిలుపునిచ్చారు. పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రపతి విడిది చేయనున్న భ్రమరాంబ అతిథి గృహంలో ఏ లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దేవస్థానం ఈవో ఎస్.లవన్నను ఆదేశించారు. చెంచు విద్యార్థుల స్వాగత నృత్యం, చెంచులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చూడాలన్నారు.