ఎవరికీ  అర్థంకాడు - MicTv.in - Telugu News
mictv telugu

ఎవరికీ  అర్థంకాడు

November 24, 2017

పేరున్న నటీనటులు లేని ఓ చిన్న సినిమా గురించి అందరికి తెలిసేలా చేసి వారిని థియేటర్లకు రప్పించాలంటే వినూత్నంగా ఆలోచించాలి. ఆనంద్ రవి  ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. నీడపోయింది అనే పాయింట్‌తో నెపోలియన్ సినిమా పట్ల ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు. ఇదేదో కొత్త తరహా సినిమా, ఇప్పటివరకు తెరపై రానిదని మాట్లాడుకునేలా చేశారు. ఆ కొత్తదనాన్ని చూసి తరించాలనే ఉత్సాహంతో థియేటర్‌లో అడుగుపెట్టిన పదినిమిషాలకే ఆనందం ఆవిరైపోతుంది. ఎరక్కపోయి ఇరుక్కుపోయామని శుభం కార్డు కోసం ప్రేక్షకులు నిరీక్షిస్తూ కూర్చొవాల్సివస్తుంది. సినిమా ఎలా తీయకూడదో, నటన ఎలా ఉండకూడదో తెలియజేయడానికి ఈ సినిమా మంచి ఉదాహరణగా నిలుస్తుంది.

రవివర్మ(రవివర్మ) నిజాయితీపరుడైన పోలీస్ అధికారి. సలహాలు ఇచ్చేవాళ్లంటే అతడికి నచ్చదు. చిన్న చితకా కేసులతో విసిపోయిన అతడి ఏదైనా ఒక ఆసక్తికరమైన కేసును చేపట్టాలని ఎదురుచూస్తుంటాడు. ఓ రోజు నెపోలియన్(ఆనంద్ రవి)అనే వ్యక్తి తన నీడపోయిందని రవివర్మను ఆశ్రయిస్తాడు. అతడి సమస్యను విన్న పోలీసులతో పాటు ప్రజలంతా ఆశ్చర్యపోతారు. ఇంతలోనే అతడి పేరు నెపోలియన్ కాదని ఆశోక్ అని స్రవంతి(కోమలి) అనే యువతి పోలీసుల వద్దకు వస్తుంది. యాక్సిడెంట్‌గా భావించి పోలీసులు ముగించిన తిరుపతి అనే అనాథ వ్యక్తి కేసును ప్లానింగ్ మర్డర్‌గా నెపోలియన్ పోలీసులకు చెబుతాడు. అతడి మాటల ఆధారంగా ఆ కేసును గురించి అన్వేషించే క్రమంలో తిరుపతిని  ముగ్గురు వ్యక్తులు హత్య చేశారనే నిజం తెలుస్తుంది. ఆ హత్య ఎవరుచేశారు? అశోక్ నెపోలియన్‌గా ఎందుకు పేరు మార్చుకున్నాడు? చనిపోయిన తిరుపతికి నెపోలియన్‌కు ఉన్న సంబంధమేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.ఓ ఆత్మ తనను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడమనే పాయింట్‌తో రూపొందిన చిత్రమిది. ఇలాంటి కామన్ పాయింట్‌ను సందేశాన్ని జోడించి దర్శకుడు చెప్పాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో తొలి అడుగునుంచే తడబడ్డారు. అసంపూర్తిగా కథను తయారు చేసుకోవడంతో సినిమా మొత్తం గందరగోళంగా తయారైంది. దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం చెబుతున్నాడో ఎంతకీ అంతుపట్టదు. పాత్రలన్ని ఏంచేస్తున్నాయో, ఎందుకు వస్తున్నాయో అర్థంకాదు. నెపోలియన్ అనే పేరుకు సినిమాకు సంబంధమేమిటో దర్శకుడికే తెలియాలి.  పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో మొదలైన సినిమా ఎంతకి ముందుకు కదలదు. హీరోతోపాటు ప్రధాన పాత్రలన్ని పల్లీలు తింటూ కాలక్షేపం చేస్తూ సమయాన్నివృథా చేస్తుంటాయి. కెమెరా ఒక చోట పెట్టి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు నటిస్తుంటారు.

ప్రథమార్థం చూస్తుంటే తాము చూస్తున్నది సినిమానో?మేకింగ్ వీడియోనో అనే అనుమానం  ప్రేక్షకుడిలో కలుగుతుంది.  ప్రజల నడుం నొప్పికి స్పీడుబ్రేకర్లే కారణం, బార్ల ముందు పార్కింగ్ తీసివేయాలంటూ హీరో ఇచ్చే సందేశాలతో తట్టుకుంటూ ఇంకా థియేటర్‌లో మిగిలినవారు ఎవరైనా ఉన్నారంటే వారి ఓపికను మెచ్చుకొని తీరాల్సిందే. విరామ సమయంలో వచ్చే మలుపుతో అసలు కథలోకి వెళ్లిన దర్శకుడు ఆ తర్వాత ఆసక్తిగా నడిపిస్తాడని ఎదురుచూస్తే భంగపడినట్లే. ఆస్తి కోసం ఆడే డ్రామాలు,  దయ్యాలు, ఆత్మలు, పోలీసు ఇన్వేస్టిగేషన్‌ల పేరిట తనకు దొరికిన ఆ కాస్తా సమయాన్ని వృథా చేశాడు. నీడపోయిందని పాయింట్‌కు  కథకు ఎలాంటి సంబంధం ఉండదు. దర్శకుడి ప్రతిభకు తగిన ఒక్కసన్నివేశం  సినిమాలో కనిపించదు.

సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా తానే ప్రధాన పాత్రలో  నటించారు ఆనంద్ రవి. దర్శకుడిగా రాణించలేకపోయినా నటుడిగానైన బాగా చేశాడని ఊహిస్తే పప్పులో కాలేసినట్లే.  సినిమా ఆద్యంతం ఒకే రకమైన ముఖ కవలికలతో విసిగిస్గాడు. సంభాషణలు సరిగా చెప్పలేకపోయారు. పాత్రకు తగిన భావోద్వేగాల్ని పండించలేకపోయారు.  గుడ్డిలో మెల్లలా మిగతా పాత్రలతో పోలిస్తే అతడే కొంత నయమనిపిస్తుంది. హీరోయిన్ కోమలితో పాటు మిగతా నటీనటులకు ఇదే తొలి సినిమా కావడంతో వారి పాత్రలన్నీ తేలిపోయాయి. అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. వారు చేసే అతిని నటన అని చెప్పడం కష్టమే.  తమ వంతు రాగానే ఇచ్చిన సంభాషణల్ని అప్పజెప్పిన భావన కలుగుతుంది.  వారి నుంచి సరైన నటనను రాబట్టుకోలేకపోయారు  ఆనంద్ రవి. రవివర్మ పర్వాలేదనిపించినా అతడి పాత్రను శక్తివంతంగా తీర్చిదిద్దలేకపోయారు.

సాంకేతికంగా సినిమా నాసిరకంగా ఉంది. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం ఏ ఒక్కటీ  బాగాలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నవతరం సాంకేతిక నిపుణులు తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన సినిమాలు చేస్తున్నారు. ఆనంద్ రవి వారి ప్రతిభను సరిగా ఉపయోగించుకోలేకపోయారు.

దర్శకుడిగా, కథకుడిగా, నటుడిగా ఇలా తాను చేపట్టిన అన్ని విభాగాల్లో ఆనంద్  రవి విఫలయ్యారు. నిర్మాతతో పాటు ప్రేక్షకుడి సమయాన్ని, డబ్బును వృథా చేసే సినిమా ఏదైనా ఉందంటే అది ఇదే.  ఓ సినిమా కథ, మంచి నటీనటులు ఎంతో ముఖ్యమో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.

రేటింగ్2/5