ఢిల్లీకి వెళ్లి  ధ‌ర్నా చేసుకోండి… - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీకి వెళ్లి  ధ‌ర్నా చేసుకోండి…

November 20, 2017

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా సాధ‌న క‌మిటీ ఆధ్వ‌ర్యంలో సోమవారం చలో  అసెంబ్లీకి పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే.  ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి పిలుపు మేర‌కు విజ‌య‌వాడ‌లోని ఆంధ్ర‌ర‌త్న భ‌వ‌న్ నుంచి కాంగ్రెస్ నాయ‌కులు శాంతి ర్యాలీ ప్రారంభించారు. దీంతో వారికి పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలు అరెస్టులకు దారితీశాయి.ఈ ర్యాలీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీని ముట్టడించడం అవివేకం.. దానివల్ల ఏ ప్రయోజనమూ  లేదు. వీలైతే ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నా చెయ్యాలి. హోదా కాదంటేనే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాం.  ప్యాకేజీకి ఒప్పుకోకుంటే అనంత‌పురానికి కియా కంపెనీ ప్రాజెక్టు ఎలా వ‌చ్చేది ? అలాగే 16 వేల కోట్లు ఉపాధి హామీ పథకానికి ఎలా మంజూరవుతాయి ? ప్యాకేజీలు, హోదాలపై అవగాహన లేనివారే విమర్శలు చేస్తున్నారు. ప్యాకేజీ కింద రాష్ట్రానికి ఏది రాలేదో చెప్పాలి’ అని  ప్ర‌శ్నించారు.

కాగా చలో అసెంబ్లీకి ప్ర‌య‌త్నించిన ఏపీసీసీ నేత‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ నాయ‌కులు చ‌ల్ల‌ప‌ల్లి బంగ్లా, ఇందిరా గాంధీ విగ్ర‌హం వ‌ద్ద నినాదాలు చేస్తూ నిరస‌న వ్య‌క్తం చేశారు. దీంతో కాంగ్రెస్ నేత‌ల‌ను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి.. నున్న‌, సింగ్ న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ప్ర‌కటించింది కాంగ్రెస్ అని, దాన్ని సాధించేది కూడా కాంగ్రెసేన‌ని ఆ పార్టీ నేత‌లు వ్యాఖ్యానించారు.