టీడీపీ యువనేత నారా లోకేశ్ చేస్తున్న యవగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోకేశ్ రోడ్డుపై ప్రసంగించేందుకు ఉద్యుక్తుడవడంతో పోలీసులు మైక్ లాక్కునేందుకు ప్రయత్నించారు. జీవో నెం 1 ప్రకారం రోడ్లపై సమావేశానికి అనుమతి లేదని పోలీసులు చెప్పగా.. టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. చిత్తూరు జిల్లా ఎన్ఆర్ పేట ఎన్టీఆర్ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. అయితే అక్కడే ప్రజలను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడుతూ ‘సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోతే ఎక్కడ పెట్టుకోవాలి? తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టుకోవాలా? అని పోలీసులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు మైక్ లాక్కునేందుకు ప్రయత్నించగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిబంధనల పేరుతో లోకేశ్ యాత్రను అడ్డుకుంటున్నారని, అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తున్నారని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.