టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేజీ టు పీజీ విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అదే విధంగా పోటీపరీక్షలను ఎదుర్కొనే విధంగా సిలబస్‌ను మార్పుచేస్తామని వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన పుంగనూరు నియోజకవర్గం కల్లూరులో యువతీయువకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.అధికారంలోకి రాగానే కల్లూరుకు డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీని తీసుకొస్తామని తెలిపారు. చిత్తూరులో స్పోర్ట్స్ యూనివర్శిటీ కూడా ఏర్పాటు చేస్తామని లోకేష్ తెలిపారు. ఉమ్మడి ఏపీలో పుల్లెల గోపీచంద్ కు భూమి కేటాయించి అకాడమీ పెట్టిస్తే మన దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ అందిస్తున్నారని గుర్తుచేశారు.
తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు పరిగెత్తుకుంటూ వస్తాయని లోకేశ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కారణంగానే ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ కంపెనీల్లో తెలుగువారు సేవలందిస్తున్నట్లు తెలిపారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చుంటే..ఇప్పటికే 50 లక్షల ఉద్యోగాలు వచ్చేవని లోకేశ్ వివరించారు. పెద్దిరెడ్డి కుటుంబం ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో ఉన్నంతకాలం పుంగనూరు అభివృద్ధి శూన్యమని విమర్శించారు.