తాగిన నీళ్లకు కారిన చెమటకు సరీపోయిందన్నట్లుంది పెద్ద నోట్ల రద్దు ముచ్చట. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇండియన్ ఎనకనామీ మారి పోతుందని…. దీని రిజల్ట్ చూసిన తర్వాత నోర్లు తెర్వడానికి రెఢీగా ఉండాలని ప్రధాని దామోదర దాస్ నరేంద్ర మోడీ అన్నారు. ఆయన అనుచర గణ ఓ అడుగు ముందుకేసి ఇంత పెగొప్ప నిర్ణయం ఇండియన్ హిస్టరీలోనే ఎవ్వరూ తీసుకోలేదని.. ప్రధాని మోడీ నిర్ణయాన్ని యావత్ భారత దేశం స్వాగతిస్తోందని సెలవిచ్చారు.ఇంకా కొందరు ఉత్సాహా వంతులైతే విషయం అస్సలు అర్థం చేసుకోవడం లేదు మీరూ… కాస్త ఆగండి అంశం బోధపడిన తర్వాత అన్నీంటిపైనా క్లారిటీ వస్తుందని తిరగేసి మల్లేసి మళ్లీ మళ్లీ దాన్నే వల్లేవేశారు.
తీరా రద్దైన నోట్లన్నీ పెద్ద బ్యాంకు కు అదే ఆర్బీఐకి వచ్చిన తర్వాత అస్సలు విషయం బోధపడింది. ఎన్ని నోట్లు రద్దు చేశారో… అంతే విలువగలిన నోట్లు తిరిగి వచ్చాయి. మరి నల్లధనం ఎక్కడికి పోయినట్లు… జనం ఖాతాల్లో వేస్తున్న వేల రూపాయల మాట ఏమైనట్లు. మార్పు వస్తుందన్నారు. ఏదీ వచ్చిన మార్పు. దీనికి సమాధానం ఇవ్వడానికి ఎవ్వరూ రెఢీగా లేనట్లుంది. అస్సలు ఈ విషయం గురించే వారు పట్టించుకున్నట్లు లేదు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత ధనవంతుల సొమ్ము అంతా బ్యాంకు కక్కిస్తుందని… మోడీ ఇచ్చిన కిక్కుకు అంతా కిమ్మనకుండా అయ్యారు. బ్లాక్ మనీ రాయుళ్ల భరతం పడుతున్నాడు మోడీ అని భావించి అంతా నెలల తరబడి రోడ్లపై నిలబడ్డారు. అక్కడే తిన్నారు.. అక్కడే పడుకున్నారు. పోలీసు లాఠీల రుచి చూశారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. కొందరు పెండ్లిల్లు వాయిదా వేసుకున్నారు. కొందరు పెండ్లిళ్లు క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంకా కొందరైతే మోడీ మీద ప్రేమతో డిజిటల్ కార్డులు పంచారు. మూత్రాలు పోయడానికి చెక్కులిచ్చారు. ఇంటి సరుకులు కొనేందుకు కిరాణా షాపుల వారు చీటీలు రాసి కొత్త టెక్నిక్ లు ప్లే చేశారు. దానికి జనం సపోర్టు చేశారు. ఇంతా చేసినా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం మాత్రం నిండా సున్నా ఫలితాన్నే ఇచ్చింది. సంపూర్ణ విజయం అంటే ఏదో అనుకున్నం. కానీ పూర్ణం అంటే సున్నా అనే విషయం ఇప్పుడు కానీ అనుభవంలోకి రాలేదు.
ఒక్క 50 రోజులు ఆగండి.. ఆ తర్వాత నాకు ఏ శిక్ష అయినా వేయండి. ఇది ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు సందర్భంగా పలికిన బంగారం లాంటి పలుకులు. ఈ మాటలు విన్న జనాలు నిజంగానే మోడీ గ్రేట్. ఇంత గట్టిగా చెప్తున్నాడంటే… ఆయనకు , ఆయన యంత్రాంగానికి దీని పై ఎంత లోతైనా అవగాహన ఉండాలి. ఎంత ముందు చూపు ఉండాలని జనం గుండెలపై చేయి వేసుకుని ఫ్యాన్ గాలి లేకున్నా వినసర్రల సాయం లేకుండానే మోడీ గాలి మాటలకు గట్టిగా నిద్ర పోయారు.
ఆ తర్వాత వారం రోజులకే రోడ్లపై పడ్డారు. ఈ దేశాన్ని రోడ్లపైకి తెచ్చారు. అంబానీని సైతం రోడ్లపైకి తెచ్చాడని కొందరు అన్నారు. సరిహద్దుల్లో సైనికులు దేశానికి రక్షణ ఇస్తున్నారు కదా.. మీరు ఎటిఎంల ముందు క్యూలో నిలబడలేరా అని ప్రశ్నించారు. అమాయకత్వం మీదో… లేక పోతే మీ మాటలు నమ్మి కిమ్మనకుండా లైన్లల్ల నీల్గిన నీతి కలిగిన ప్రజలతో ఇంకా అర్థం కావడం లేదు. రద్దైన నోట్ల విలువ 15 లక్షల కోట్ల వరకు ఉంది. ఆర్బీఐకి వచ్చినవి 16వేల కోట్ల రూపాయలు తక్కువ అంతే. అంతే కాదు నకిలీ నోట్లు పెద్ద నోట్ల రద్దు తర్వాత మునుపటి కంటే మరింత పెరిగాయట. ఇంతకు ముందు 1000, 500 నోట్ల రూపంలో 4 నుండి 5 లక్షల కోట్ల వరకు నకిలీ నోట్లు చెలామణిలో ఉంటే ఇప్పుడు 2000, 500 నోట్ల స్థానంలో 7 లక్షల కోట్ల వరకు పెరిగాయట. ఇవన్నీ ఆర్థిక నిపుణులు చెప్తున్నలెక్కలే.
ఇంత పెద్ద మార్పు తీసుకొస్తారని జనాలకు అర్థం కాలేదు. ఏదో మంచి చేస్తాడు కదా అనుకున్నారు. ఇట్లా ఉత్త పుణ్యానికి ముంచుతావని అనుకోలేదు. ఇండియా ఓ అడుగు ముందుకేసిందన్నారు. మేకిన్ ఇండియా అన్నారు. మేడిన్ ఇండియా అన్నారు. ఉద్యోగాలిస్తామన్నారు. అకౌంట్లల్లో డబ్బులేస్తామన్నారు. తీరా చూస్తే ఆర్థిక వ్యవస్థ పడకేసి గాఢ నిద్రలోకి పోయేలా చేశారనే విమర్శలు మూట గట్టుకున్నారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత జనాలకు కష్టాలు కట్టకట్టుకుని మరీ వచ్చాయి. తమ సర్వీసులో ఎప్పుడూ లేనంత ఒత్తిడిని బ్యాంకర్లు ఎదుర్కొన్నారు. ఇళ్లు, పెండ్లాం, పిల్లలు వదిలేసి రాత్రుళ్లు కూడా బ్యాంకుల్లోనే బస చేసిన దాఖాలాలున్నాయి. మన దేశమే కాదు మన పక్కపొంటి ఉన్న దేశాల్లో ఉన్న వారు కూడా మన నోట్ల రద్దు దెబ్బకు విలవిల్లాడిపోయారు. నేపాల్ నైతే ఇంకా 3 వేల కోట్ల రూపాయల ఇండియన్ రద్దైన కరెన్సీ అట్లాగే ఉందట. ఇంతకు ముందు మన రూపాయి ఆ దేశంలో ఈజీగా చెల్లుబాటు అయ్యేదట. ఇప్పుడు అక్కడి వారు ఇండియన్ కరెన్సీ అంటే అదిరిపోతున్నారట. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటారు. కానీ ఇన్ని కోట్ల పిట్లలు విలవిల్లాడ్తాయని అనుకోలేదు.
మోడీ సారు మన ఆర్థిక వ్యవస్థను గాడీలో పెడ్తామని సెలవిచ్చారుజైట్లీ గారు. ప్రధాన మంత్రితో సహా మంత్రులు చెప్తున్న నోట్ల రద్దు ప్రయోజనం పద్దు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ముందు ముందు సై అన్న వారు ఆ తర్వాత నై అన్నారు. స్వయనా సొంత పార్టీకి చెందిన నాయకులు తూఛ్ అంటున్నారట. మరిప్పుడు మోడీ, ఆయన మంత్రి వర్గం దేశానికి ఏం సమాధానం చెప్తుందో చూడాలి.
లాస్ట్ క్వశ్చన్ : నోట్ల రద్దు తర్వాత గుర్గావ్ బ్యాంకు ముందు క్యూలో తన స్థానం పోయిందని ఏడ్చిన ముసలి రిటైర్డ్ సైనికుని వేదనకు, కన్నీళ్లకు ఖరీదు కట్టే షరాబు మీలో ఎవరో చెప్పండి. మోడీ సారు మిమ్మల్నే….. వినపడిందా……..?.
అసురాసుర