నగర పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. శనివారం రాత్రి వివాహితను కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెపై కారులోనే అత్యాచారం చేసి ఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రి ఏడు నుంచి ఏడున్న గంటల మధ్య జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లాకు చెందిన వివాహిత పీరం చెరువు సమీపంలో నివాసం ఉండి పరిసర ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి పని ముగించుకొని ఇంటికి బయల్దేరగా గ్రామం సమీపంలో దుండగులు అడ్డగించి కిడ్నాప్ చేశారు. నోరు తెరిస్తే చంపేస్తామని బెదిరించి బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.
ఈ క్రమంలో సెల్‌ఫోన్లను స్విచ్ఛాఫ్ చేయడం గమనార్హం. గ్యాంగ్ రేప్ చేశాక బాధితురాలి ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారం తీసుకొని రాత్రి సమయంలో గండిపేట వద్ద వదిలేసి వెళ్లిపోయారు. మత్తు నుంచి కోలుకున్నాక వివాహిత తన భర్తకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. హుటాహుటిన చేరుకున్న భర్త లేవలేని స్థితిలో ఉన్న భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా జరిగిన ఘోరాన్ని తన భర్తకు వివరించగా, నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అటు ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ సమయాన్ని గడుపుతున్నారు.