ఎలక్ట్రిక్ విమానాలు వచ్చేస్తున్నాయ్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎలక్ట్రిక్ విమానాలు వచ్చేస్తున్నాయ్..

November 11, 2019

విమానం అనగానే అందరికీ విలాసవంతమైన ప్రయాణం గుర్తుకువస్తుంది. విమానంలో వేగంగా వెళ్ళవచ్చు అనుకుంటారు. కానీ, అలా ప్రయాణించడానికి వ్యయం కూడా ఎక్కువే అవుతోంది. అందుకే విమానాల నిర్వహణ విమానయాన సంస్థలకు భారం అవుతోంది. విమానాలకు వాడే వైట్‌ పెట్రోల్‌ ఖరీదైనది. ఈ ఖర్చును తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనంతో విమానాలు నడిపే సాంకేతిక పరిజ్ఞానం కోసం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ గత కొంత కాలంగా చేస్తున్న ప్రయోగాలు ఫలించాయి. నాసా రూపొందించిన ఎలెక్ట్రిక్ విమానం త్వరలో గాల్లోకి ఎగరనుంది.

ఇప్పటికే ఈ విమానాన్ని తమ ఏరోనాటిక్‌ ప్రయోగశాలలో పరీక్షించామని, రిజల్ట్ సంతృప్తిగా ఉందని నాసా పేర్కొంది. మరికొన్ని నెలల్లో ఎడ్వర్డ్‌ ఎయిర్ ఫోర్స్ బేస్‌ నుంచి ఈ ఎలెక్ట్రిక్ విమానం గాల్లోకి ఎగురుతుందని నాసా పేర్కొంది. 14 మోటార్లతో నడిచే ఈ విమానానికి మాక్స్‌వెల్‌ ‘ఎక్స్‌-57’ అని పేరు పెట్టింది. 2015లో ఈ విమానాన తయారీ మొదలైంది. దీనిని ఇటలీకి చెందిన టెక్నాం-పీ2006టీ విమానం ఆధారంగా తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్‌ బ్రెంట్‌ కోబ్‌లీ మాట్లాడుతూ ఇప్పటికే పలు కంపెనీలు విద్యుత్‌ ఇంధన ఆధారిత విమానాల తయారీని మొదలెట్టాయి. కానీ, నాసా రూపొందించిన ఈ విమానం ప్రభుత్వం ధ్రువీకరించిన వాణిజ్య ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోందని తెలిపారు. నాసా తన ఇరవై ఏళ్ల చరిత్రలో రూపొందించిన విమానాల్లో ఇది మొదటిదని తెలిపారు. కేవలం నాసాకే కాకుండా మొత్తం విమాన పరిశ్రమే ఈ తరహా విమానాలు తయారు చేసేలా సాంకేతిక పరిజ్ఞానం రూపొందుతోందని బ్రెంట్‌ తెలిపారు.