NASA released the photo taken by the James Webb Telescope
mictv telugu

మనుషులు చూడని అరుదైన అంతరిక్ష ఫోటో.. బైడెన్‌తో ఆవిష్కరించిన నాసా

July 12, 2022

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తన లేటెస్ట్ టెలిస్కోప్ జేమ్స్‌వెబ్ ద్వారా తీసిన అరుదైన ఫోటోను అధ్యక్షుడు బైడెన్‌ చేతుల మీదుగా విడుదల చేసింది. 13 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ప్రారంభమైనప్పటి చిత్రం ఇది. అత్యంత స్పష్టంగా, నాణ్యతతో తీసిన ఈ చిత్రంలో అద్భుతమైన వేలాది గెలాక్సీలు వివిధ రంగుల్లో కనువిందు చేస్తున్నాయి. ఈ సందర్భంగా నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ వెల్సన్ మాట్లాడుతూ.. ‘బిగ్ బ్యాంగ్ కంటే కేవలం 800 మిలియన్ సంవత్సరాల చిన్నది ఈ ఫోటో. ఈ కాంతి 13 బిలియన్ సంవత్సరాలుగా ప్రయాణిస్తోంది. 2021 డిసెంబరు 25న ప్రయోగించిన ఎరియాన్ రాకెట్ ద్వారా ఈ జేమ్స్ వెబ్ కెమెరాను రోదసీలోకి పంపాం. ఇందుకు దాదాపు రూ. 73 వేల కోట్లు ఖర్చయింది. మొదట పదేళ్లు, తర్వాత 20 ఏళ్లకు దీని కాలపరిమితిని పెంచాం. దీని ద్వారా విశ్వం పుట్టుక, రహస్యం, నక్షత్రాలు వంటి అంశాలను ఛేదించేందుకు అవకాశం ఏర్పడుతుంది’ అని వెల్లడించారు. ఈ రోజు అమెరికాతో పాటు మొత్తం మానవాళికి గుర్తుండిపోయే రోజు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. కాగా, విశ్వంలోనే అతి భారీ టెలిస్కోపుగా జేమ్స్ వెబ్ రికార్డు సాధించింది. దీనిని అమెరికా, ఐరోపా, కెనడాలు సంయుక్తంగా రూపొందించాయి.