NASA Spots Planet Killer Fragment Coming Towards Earth
mictv telugu

దూసుకొస్తున్న కిల్లర్ ప్లానెట్.. ఆందోళనలో నాసా!

November 1, 2022

NASA Spots Planet Killer Fragment Coming Towards Earth

మనం నివసించే భూగ్రహం వైపు దూసుకొచ్చే ప్రమాదకర గ్రహ శకలాలను గుర్తించే నాసా.. వాటిని నాశనం చేయడమో లేక దారి మళ్లించడమో చేస్తుంది. నెల క్రితం అంతరిక్షంలో భూమి వైపు వస్తున్న ఓ ఆస్టరాయిడ్‌ని స్పేస్ క్రాఫ్ట్‌తో విజయవంతంగా దారి మళ్లించింది. తద్వారా భూమికి ఆపద తప్పించింది. అయితే ఇప్పుడు పిడుగులాంటి వార్తను నాసా రివీల్ చేసింది. భూమికి అత్యంత సమీపంగా వచ్చే అవకాశమున్న మూడు శకలాలను గుర్తించింది.

అంతేకాక, అవి సౌర వ్యవస్థ లోపలే ఉన్నాయని, వాటి గమనాన్ని గుర్తించడం కష్టంగా ఉందని వెల్లడించింది. మూడిట్లో రెండు కిలోమీటర్ వెడల్పు ఉండగా, ఒకటి మాత్రం కిలోమీటరున్నర వెడల్పు ఉన్నట్టు గుర్తించింది. మూడో గ్రహశకలాన్ని కిల్లర్ ప్లానెట్‌గా అభివర్ణించింది. దీనికి 2022 ఏపీ7 అనే పేరు పెట్టగా, ఈ శకలమే భూమిని ఢీకొట్టే అవకాశముందని వివరించింది. ఈ మూడు శకలాలు ప్రస్తుతం భూమి – శుక్ర గ్రహాల ఆర్బిట్ మధ్య ఉన్నాయని, సూర్య కాంతి కారణంగా వీటి గమనాన్ని గుర్తించడం కష్టంగా ఉందని నాసా బృందం తెలిపింది. చిలీలోని సెర్రో టోలోలోని ఇంటర్ అమెరికన్ అబ్జర్వేటరీ వద్ద టెలిస్కోపుకు అమర్చిన డార్క్ ఎనర్జీ కెమెరా ద్వారా గ్రహాలను కనిపెట్టగలిగామని పేర్కొంది. పెద్దదైన 2022 ఏపీ7 శకలం ఏదో ఒకరోజు కచ్చితంగా భూకక్షలోకి అడుగుపెడుతుందని, కానీ, దారి మళ్లించడం లేదా నాశనం చేయడం గురించి ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయలేమని స్పష్టం చేసింది.