ఇవ్వాల్టి నుంచి హైదరాబాద్‌లో పుస్తక జాతర మొదలుకానుంది. సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో 35వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభమవుతుందని.. వచ్చే నెల 1వరకు ఈ జాతర కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ పుస్తక ప్రదర్శనను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇందులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరొందిన పుస్తక సంస్థలు పాల్గొననున్నాయి. ఏటా ఈ పుస్తక మహోత్సవానికి రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి పబ్లిషర్స్‌తో పాటు పుస్తక ప్రియులు భారీ సంఖ్యలో తరలివస్తారు.
ఈ పుస్తక ప్రదర్శనలో 300 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుక్ ఫెయిర్ ప్రాంగణానికి ప్రముఖ ఒగ్గుకథ కళాకారుడు మిద్దె రాములు పేరు పెట్టారు. వేదికకు కవి అలిశెట్టి ప్రభాకర్ పేరు ఖరారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, ప్రముఖుల జీవిత చరిత్ర సహా వివిధ రంగాలకు చెందిన పుస్తకాలు ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయి. ముఖ్యమంత్రి స్టాల్లో, కేసీఆర్‌పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు, ఉద్యమ ప్రస్థానం, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలపై పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.
తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ సహా ఇతర భారతీయ భాషల సాహిత్యంతోపాటు నవలలు, కథలు, శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం పుస్తకాలు అందుబాటులో ఉండనున్నాయి.పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారి కోసం స్టడీ మెటీరియల్స్, వివిధ పబ్లికేషన్స్‌కు సంబంధించిన పుస్తకాలు ప్రదర్శనలో లభించునున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. శని, ఆదివారాలు.. ఇతర సెలవు రోజుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
1.డీహెచ్‌ను సస్పెండ్ చేసేదాకా మా పోరాటం ఆగదు: వీహెచ్‌పీ
2.కరోనాతో యుద్ధానికి సై.. రంగంలోకి ప్రధాని మోదీ