National Herald case: ED questions Sonia Gandhi for over 3 hours on day 3
mictv telugu

100కిపైగా ప్ర‌శ్న‌లు.. ముగిసిన సోనియాగాంధీ ఈడీ విచార‌ణ‌

July 27, 2022

National Herald case: ED questions Sonia Gandhi for over 3 hours on day 3

నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం మూడు గంటల పాటు ప్రశ్నించింది. ఇప్పటికే రెండు రోజులు సోనియాను విచారించిన ఈడీ.. బుధవారం కేసుకు సంబంధించి మరిన్ని ప్రశ్నలు సంధించింది. కొత్తగా ఎలాంటి సమన్లు జారీ చేయలేదని అధికారులు తెలిపారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పారు. సెంట్రల్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ చేరుకున్నారు. కుమార్తె ప్రియాంకా గాంధీ, కుమారుడు రాహుల్ గాంధీ ఆమె వెంట వెళ్లారు. 11.15 గంటలకు ఈడీ విచారణ ప్రారంభమైంది. కేసు విచారణ జరుపుతున్న కీలక అధికారి.. సోనియాను ప్రశ్నలు అడిగారు. మరో అధికారి ఆమె చెప్పిన సమాధానాలను రాసుకున్నారు.

ఈ విచారణలో.. సోనియాను ఇప్పటివరకు 95 నుంచి 110 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన సోనియా.. మరికొన్నింటికి తనకు తెలియవని చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంగళవారం సోనియా విచారణ అనంతరం.. ఆమె ప్రశ్నలకు వేగంగా సమాధానం చెబుతున్నట్టుగా ఈడీ వర్గాలు తెలిపాయి. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక, యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌లలో ఆమె ప్రమేయంపై సోనియా గాంధీని ప్రశ్నించారు. యంగ్ ఇండియన్‌లో మెజారిటీ వాటాదారులుగా ఉన్నందున.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాహుల్ గాంధీ చెప్పిన సమాధానాలతో సోనియా గాంధీ సమాధానాలను సరిపోల్చనుంది. ఇదే కేసుకు సంబంధించి ఈడీ అధికారులు పలు దఫాలుగా రాహుల్ గాంధీని 5 రోజుల పాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రాహుల్‌ను ఈడీ అధికారులు దాదాపు 150 ప్రశ్నలు అడిగారు.