ఉత్తరాంధ్రలో మరో మెడికల్ కాలేజీ వచ్చేసింది. విజయనగరంలో ఏర్పాటవుతున్న మెడికల్ కాలేజీకి జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లతో కాలేజీ ప్రారంభం కానుంది. 2023-24 నుంచి తరగతులు మొదలవుతాయని ఎన్ఎంసీ తెలిపింది. అలాగే దేశంలో మరో నాలుగు మెడికల్ కాలేజీలకు కూడా అనుమతి ఇవ్వబోతున్నట్లు వెల్లడించింది. రూ. 500 కోట్లతో ఇప్పటికే ఈ కాలేజీ పనులు పూర్తవుతున్నాయి కలెక్టర్ సూర్యకుమారి చెప్పారు. ఏపీలో కొత్తగా 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు కాగా, అందులో అనుమతులు పొందిన తొలి కాలేజీ ఇదే. ఎన్ఎంసీ అధికారులు ఈ నెల 3న కాలేజీ భవనాను పరిశీలించి అనుమతులు మంజూరు చేశారు. 30 పడకలతో ఎన్ఐసియు, ఐసియు, ఎస్ఐసియు సదుపాయాలతోపాటు గర్భిణులు, శిశువుల కోసం ఆస్పత్రిని నిర్మించారు. కాలేజీ, ఆస్పత్రులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే విజయనగరం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మెరుగైన వైద్యం కోసం విశాఖ వంటి దూరాభారాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.