National Party from Hyderabad: KCR
mictv telugu

హైదరాబాద్ వేదికగా జాతీయ పార్టీ: కేసీఆర్

September 9, 2022

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే జాతీయ రాజకీయాల్లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారని, కేసీఆర్‌ నేతృత్వంలో పోరుగడ్డ తెలంగాణ వేదికగా నూతన జాతీయ రాజకీయ పార్టీ అవతరించబోతుందని.. టీఆర్‌ఎస్‌లోని వర్గాలు సమాచారాన్ని వెల్లడించాయి. అంతేకాదు, తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటూనే..కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తారని, ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశ రాజకీయాన్ని నడిపిస్తారని తెలియజేశారు.

”అధికారమే అంతిమంగా చేసే తంత్రాలకు, పదవులే లక్ష్యంగా సాగే పంథాలకు భిన్నంగా, దేశమే జెండాగా, ప్రజలే ఎజెండాగా, జాతి ప్రయోజనాలే దండుగా దేశానికి నూతన రాజకీయ ప్రత్యామ్నాయ పంథాను కేసీఆర్‌ ప్రతిపాదించబోతున్నారు. చారిత్రక నగరం హైదరాబాద్‌ వేదికగానే కేసీఆర్‌ జాతీయ రాజకీయ పార్టీ ఆవిర్భావం జరుగుతుంది. తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటూనే కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశ రాజకీయాన్ని నడిపిస్తారు. ముఖ్యమంత్రిగా ఉంటూ జాతీయ స్థాయిలో గొంతెత్తినప్పుడే దాని ప్రభావశీలత, వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అప్పుడే జాతీయ పార్టీని వేగంగా, బలంగా అన్ని ప్రాంతాలకు విస్తరించగలుగుతాము. అందుకే ఈ వ్యూహాన్ని ఎంచుకున్నాం” అని టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

మరోపక్క తెలంగాణలో ఆయా జిల్లాల్లో ఇటీవలే జరిగిన పలు బహిరంగ సభలలో కేసీఆర్ మాట్లాడుతూ..” మీరందరు ఆశీర్వదిస్తే, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని తెలియజేస్తా. అధికారాన్ని అడ్డంపెట్టుకొని మతకల్లోలలు సృష్టిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతా. దేశమంతటా ఉచితంగా కరెంట్ వచ్చేలా ప్రభుత్వాన్ని నడిపిస్తా” అంటూ పలు హామీలు ఇచ్చారు. అంతేకాదు, గతకొన్ని నెలలుగా కేసీఆర్..బీహార్, ముంబై, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని ఆయా పార్టీల నాయకులను కలిసి పలు చర్చలు జరిపారు.

తాజాగా అతి త్వరలోనే కేసీఆర్ హైదరాబాద్ వేదికగా జాతీయ పార్టీని ప్రకటించబోతున్నారని టీఆర్ఎస్ వర్గాలు తెలియజేయడంతో ప్రస్తుతం జాతీయ పార్టీ అంశం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ కొత్తగా పెట్టే పార్టీ పేరు ఏంటీ? ఏఏ రాష్ట్రాల నాయకులు ఆ పార్టీలో భాగస్వాములు అవుతున్నారు? ఎప్పుడు పార్టీని ప్రకటిస్తారు? అనే విషయాలపై తెగ చర్చ జరుగుతోంది.