మన దరిద్రం ఎంతో తేల్చేస్తారు.. కొత్త సర్వే షురూ - MicTv.in - Telugu News
mictv telugu

మన దరిద్రం ఎంతో తేల్చేస్తారు.. కొత్త సర్వే షురూ

February 21, 2020

cv b

కేంద్ర ప్రభుత్వం కొత్త సర్వేకు తెరలేపింది. దేశంలో నెలకొన్న దారిద్య్ర పరిస్థితులను అంచనా వేసేందుకు సర్వేను ప్రారంభించింది. ఇల్లు, మౌలిక సదుపాయాలు, పౌష్టికాహారం, తాగునీరు, వంట గ్యాస్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. 

దేశంలోని  పేదల సంఖ్య, దారిద్య్ర పరిస్థితులతో సంక్షేమ పథకాల అమలును  అత్యంత కీలకంగా భావించిన ప్రభుత్వం ఈ సర్వేకు సిద్ధమైంది. నీతి ఆయోగ్ పర్యవేక్షణలో స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్(MoSPI) మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించనుంది. ఈ సర్వేలో వెల్లడయ్యే ఫలితాలను యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(UNDP)కి సంబంధించిన బహుముఖ దారిద్య్ర ఇండెక్స్(MPI)లో పొందుపరుస్తారు. 

సర్వే ఆధారంగా నీతి ఆయోగ్ ఆయా రాష్ట్రాలకు ర్యాంకులు ఇస్తుంది. దీంతో దారిద్య్ర నిర్మూలనకు రాష్ట్రాల మధ్య పోటీ నెలకొంటుందని సర్వే నిపుణులు భావిస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ పోవర్టీ ఇండెక్స్ ర్యాంకులో భారత్ ర్యాంకు మెరుగుపడేందుకు అది దోహదపడుతుందని వారు భావిస్తున్నారు. అయితే ప్రపంచ ప్రామాణికత ప్రకారం.. ఆదాయంతోనే దారిద్య్రాన్ని అంచనా వేయలేరు. అందులో ఆరోగ్య ప్రమాణాలు, నాణ్యత లేని పని, పొంచివున్న హింస వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో సర్వే 10 పాయింట్లను పరిగణలోకి తీసుకుంటుంది. అందులో వైద్యం(పౌష్టికాహారం,చిన్నపిల్లల మరణాలు), విద్య(స్కూలింగ్ ఇయర్స్, స్కూల్ అడ్మిషన్స్), జీవన ప్రమాణాలు(తాగునీరు, సానిటేషన్, విద్యుత్, వంటగ్యాస్, ఫ్లోర్, ఆస్తులు) వంటివి ఉంటాయి.

కాగా, పేదరికం,దారిద్య్రంపై చివరిసారిగా టెండూల్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని సి.రంగరాజన్ కమిటీ నివేదిక సమర్పించింది. అందులో దేశంలో పేదల సంఖ్య మరో 10కోట్లు పెరిగినట్టు వెల్లడైంది. అయితే ఆ కమిటీ రిపోర్టును 2014లో ఎన్డీయే ప్రభుత్వం తినస్కరించింది. మళ్లీ ఆరేళ్ల తర్వాత దేశంలో పేదరికం, దారిద్య్ర పరిస్థితులను లెక్క కట్టేందుకు సిద్ధమవడం విశేషం.