భారతదేశం గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకొంటున్నది. జాతీయ పర్యాటకం అనేది సంస్కృతిని ప్రోత్సహించడానికి, దేశంలోని పర్యాటక రంగాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక రోజు.
ఎంతో వైవిధ్యం
భారతదేశం సుసంపన్నమైన సంస్కృతి, భిన్నత్వం కలిగిన దేశం. దేశంలోని ప్రతి మూల అందంగా ఉంటుంది. 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. భారతదేశం ఐకానిక్ గమ్యస్థానాలను కలిగి ఉంది. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక ప్రాముఖ్యత ముడిపడి ఉంది. అందుకే ఈ సందర్భంగా దేశంలోని పర్యాటక రంగానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీకందిస్తున్నాం.
1. 2015లో భారతదేశంలోని జీడీపీకి ప్రయాణ, పర్యాటక పరిశ్రమ మొత్తం 124.8 బిలియన్ డాలర్లను అందించింది. ఇది భారతదేశ మొత్తం జీడీపీలో సుమారు 6శాతంగా ఉంది.
2. భారతదేశంలో పర్యాటకం 40మిలియన్ల ఉద్యోగాలను అందిస్తున్నది. ఈ రంగం 2023 వరకు 7.9 శాతం వార్షిక సగటు వృద్ధి రేటుతో వృద్ధి చెందుతుందని అంచనా. దీనివలన భారతదేశం వచ్చే దశాబ్దంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మూడవ పర్యాటక గమ్యస్థానంగా మారింది.
3. అక్టోబర్ 2016లో 7,54,000గా ఉన్న పర్యాటకుల సంఖ్య నవంబర్ లో 8,91,000కి పెరిగింది. ఇది 2000 నుంచి 2016 వరకు సగటున 4,26,846.43 గా ఉంది. ఇది డిసెంబర్ 2015లో ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 9,13,000గా ఉంది. మే 2001లో 29,286 కనిష్ఠ స్థాయికి చేరుకుంది.
4. దేశం 40 యునెస్కో వారసత్వ ప్రదేశాలకు నిలయం. ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడిన చివరి ప్రదేశం గుజరాత్ నగరంలో ఉన్న హరప్పా నగరం ధోలవీర. దేశంలో ప్రస్తుతం 32 సాంస్కృతిక ప్రదేశాలు, 7 సహజ ప్రదేశాలు, ఒక మిశ్రమ ప్రదేశం ఉంది.
5. హిమాలయ రాష్ట్రమైన సిక్కిం ప్రస్తుత భారతదేశంలో అత్యంత సేంద్రీయ రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రంలో 47.3శాతం అటవీ విస్తీర్ణం ఉంది. అంతేకాకుండా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్తో సహా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా రాష్ట్రం నిషేధించింది.
6. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైలు వంతెన ఉన్న దేశం మనది. 1,315 మీటర్ల పొడవైన చీనాబ్ వంతెన జమ్మూకశ్మీర్ లో ఉంది. ఇది ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్ల ఎత్తులో ఉంది.
7. భారతదేశం నార్త్ సెంటినెల్ ద్వీపం ప్రపంచంలో ఎవరూ చూడని ప్రాంతంలో ఒకటి. ఈ ద్వీపం సెంటినెలీస్ ప్రజలకు నివాసంగా ఉంది. వారు ప్రపంచం నుంచి తమను తాము వేరు చేసుకున్నారు.
8. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా కోట దేశంలోనే అతి పురాతనమైనది. ఇది రాజ సంపదకు నిలయంగా ఉండేది. 3500 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చెబుతారు. కాంగ్రా కోట తన జీవితకాలంలో 52 దాడులను తట్టుకుంది. నేడు ఈ కోట శిథిలావస్థలో ఉంది.
9. భారతదేశం ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి.. తాజ్ మహల్. షాజహాన్ చక్రవర్తి తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ కోసం నిర్మించిన స్మారక చిహ్నం పర్షియా, ఇస్లాం, టర్కీ, భారతదేశ నిర్మాణ శైలిని సూచిస్తుంది.
10. 2013లో ఐదు నక్షత్రాల హోటళ్లలో బస చేసే యూఎస్ ప్రయాణికులకు ముంబై ప్రపంచంలోనే రెండవ చౌకైన నగరంగా ఉంది.