National youth day today
mictv telugu

ఉరకలెత్తే యువత…దేశానికి ప్రగతి

January 12, 2023

National youth day today

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళోయ్….వెర్రెక్కి ఉన్నోళ్ళోయ్…ఇది అక్షరాల నిజం. యవ్వనంలో ఉన్నంత హుషారు మరెప్పుడూ ఉండదు. ఉరకలెత్తే ఉత్సాహం, పరుగులు పెట్టించే వయసు…దేనికీ పట్టపగ్గాలు ఉండవు. యూత్ అంటేనే ఎనర్జీ. ట్రిగ్గర్ నొక్కిన గన్‌లో బుల్లెట్ లా దూసుకెళ్ళేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారే యూత్. వాళ్ల ఆలోచనలు మెరుపువేగం, చేతల్లో చురుకుదనం, తలచుకుంటే ఏదైనా చేసి చూపించే సత్తా వాళ్ల సొంతం. అందుకే యువతకు ఓ దినోత్సవం ఉంది. ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద జయంతిని జరుపుకుంటారు. ఇదే రోజున ‘జాతీయ యువజన దినోత్సవం’గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే వివేకానందునికి యువతతో చాలా లోతైన అనుబంధం ఉంది. అందుకే తన పుట్టినరోజు యువతకు అంకితం ఇవ్వబడింది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకుంటారు.

గగనమే వీరి గమ్యం… నేటి యువతే రేపటి భవిత అంటారు . ఓ యువతా మేల్కొనండి..
మీ లక్ష్యాన్ని సాధించేంత వరకు ఆగకండి..మీరు జీవించి ఉన్నంత కాలం నేర్చుకుంటూనే ఉండండి..అనుభవమే ప్రపంచంలో మీకు ఉత్తమ గురువు అంటారు స్వామీ వివేకానంద. యువ‌త ఎదుర్కొంటున్న సమ‌స్యలు, వారి సామాజిక బాధ్య‌త‌లు గుర్తు చేసేందుకు వారికి సంబంధించిన సాంస్కృతిక, చ‌ట్ట‌ప‌ర‌మైన స‌మ్య‌స్య‌ల‌పై యువ‌త‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌టమే ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం. మనకు చాలా మంది చాలా మంచి మాటలు చెప్పారు. అయితే ఎవరు ఏం చేప్పినా అందులో ముఖ్యంగా ఉద్దేశించినది మాత్రం యువతను మాత్రమే. ఎందుకంటే ఏ దేశ ప్రగతికైనా యువతే ముఖ్యం. యువత ఎక్కువగా ఉన్న దేశమే సంపన్న దేశం అంటారు. అందుకే భారతదేశం ఆర్ధికంగా కొంత వెనుకబాటుగా ఉన్నా ఎక్కువ యువత కలిగి ఉన్న దేశంగా ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది.

ప్రపంచానికిభారతదేశంఆధ్యాత్మిక విలువలను చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన బోధనలు ఎప్పుడూ యువతకు స్ఫూర్తినిస్తాయి. ఆయన ప్రసంగాలు కూడా యువకుల్లో చైతన్యం నింపేలా సాగేవి. అందుకే ఆయన జయంతి జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం లేదా నేషనల్ యూత్ డే నిర్వహించాలని 1984లో భారత ప్రభుత్వం నిర్ణయించింది. 1985 నుంచి ఏటా వివేకానందుడి ఆదర్శాలు కొనసాగేలా యువజన దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రోజును యువ దివస్ అని కూడా పిలుస్తారు.

నేషనల్ యూత్ డే సందర్భంగా భారత్‌లో స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహించనున్నారు. జనవరి 12న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించనున్నారు. ఇది భారతదేశపు 26వ జాతీయ యువజనోత్సవం. కర్ణాటకలో దక్షిణాదిలోని హుబ్బలి జిల్లాలో మోదీ ఈ పండుగను మొదలుపెట్టనున్నారు. ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకుని భారతదేశంలోని పాఠశాలలు, కళాశాలలు వ్యాసరచన పోటీలను నిర్వహిస్తాయి. కవాతులు, ప్రసంగాలు, పఠనాలు, పాటలు, సమావేశాలు, సెమినార్‌లను నిర్వహిస్తాయి. ఈ సంవత్సరం నేషనల్ యూత్‌డే సందర్భంగా కర్ణాటకలోని హుబ్బల్లి-ధార్వాడ్‌లో జనవరి 12 నుంచి 16 వరకు ‘విక్షిత్ యువ – వీక్షిత్ భారత్’ అనే థీమ్‌తో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశంలోని యువతలో స్వామి వివేకానంద స్ఫూర్తిని నింపేలా వేడుకలు జరుపుతారు. ఇంతకుముందు యూత్‌ ఫర్ ఎ క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్‌మెంట్, యూత్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్, యూత్ ఫర్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ వంటి థీమ్‌లతో వేడుకలు జరిగాయి.

స్వామి వివేకానంద:

స్వామి వివేకానంద పూర్తి పేరు నరేంద్ర నాథ్ దత్తా. ఆయన 1863 జనవరి 12న కోల్‌కత్తాలో జన్మించారు. విద్య, మానవ సాధికారత కోసం కృషి చేశారు. నిస్వార్థంగా మానవాళికి సేవ చేయడం ద్వారా మాత్రమే ఎవరైనా నిజంగా మతాన్ని, దేవుడిని కనుగొనగలరని నమ్మారు. శ్రీరామకృష్ణ పరమహంస అనుచరుడిగా ఉంటూ, తన ఉపన్యాసాల ద్వారా దేశవ్యాప్తంగా యువ చైతన్యాన్ని పెంపొందించారు. వివేకానంద 1893లో చికాగోలో వరల్డ్‌ పార్లమెంట్‌ ఆఫ్‌ రిలీజియన్స్‌లో తన ప్రసంగంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. దీనిని ఇప్పటికీ ‘సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా’ అని పిలుస్తారు. వివేకానంద బోధనలు నేటికీ పుస్తకాల రూపంలో అత్యంత జనాదరణ పొందాయి.

ఓ కల, ఓ ఆశయం, ఓ పట్టుదల, ఓ ప్రయత్నం, ఓ విజయం.. ఇవన్నీ యువత సొంతం. వారే డ్రైవింగ్ ఫోర్స్. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంటుంది. యువత బాధ్యతతో ఉండాలి. తమ కుటుంబాలను, సమాజాన్నీ, దేశాన్నీ కాపాడాలి. ఏ దేశానికైనా ఉత్తమ వనరులు యువతే. యంగ్ ఎనర్జీలకు ఉత్సాహం ఇవ్వాలి. అనుకున్నది సాధించాలి.. అడుగులు ముందుకు పడాలి.. ప్రతి ప్రయత్నం సక్సెస్ రుచి చూపించాలి. ఈ సందర్భంగా యువత కోసం వివేకానంద చెప్పిన కోట్స్ మీ కోసం….

1.మీరు ఏమనుకుంటారో అదే అవుతారు..
మిమ్మల్ని మీరు బలహీనంగా భావిస్తే.. మీరు బలహీనంగానే మారతారు..
అదే మీరు మిమ్మల్ని బలంగా భావిస్తే, మీరు బలంగా మారతారు.

2.ఓ యువతా మేల్కొనండి..
మీ లక్ష్యాన్ని సాధించేంత వరకు ఆగకండి..

మీరు జీవించి ఉన్నంత కాలం నేర్చుకుంటూనే ఉండండి..
అనుభవమే ప్రపంచంలో మీకు ఉత్తమ గురువు

3. మీరు జీవించి ఉన్నంత కాలం నేర్చుకుంటూనే ఉండండి..
అనుభవమే ప్రపంచంలో మీకు ఉత్తమ గురువు.

ఒక వ్యక్తి దగ్గర పైసా లేకపోయినా పేదవాడు కాదు..
కానీ ఎవరైతే కలలు, ఆశయాలు లేకుండా ఉంటారో వారే అసలైన పేదవాడు..

4.నీ ముందు ఏముంది.. నీ వెనుక ఏముంది..
అనే విషయాలను పట్టించుకోవద్దు..
నీలో ఏముందనేది కీలకం అని గుర్తించు..

ఒక్క క్షణం ఓపికతో ఉంటే చాలు..
కొండంత ప్రమాదాన్ని సైతం ఆపొచ్చు..
కానీ ఓపిక లేకపోతే మాత్రం జీవితమంతా నాశనమవుతుంది..

5.ప్రతిరోజూ ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేదంటే మీరు ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు..

లైఫ్ లో డబ్బు కోల్పోయినా పర్వాలేదు..
కానీ మీ క్యారెక్టర్ మాత్రం కోల్పోవద్దు..
క్యారెక్టర్ కోల్పోతే అంతా కోల్పోయినట్టే..’

మనం ఏదైనా రంగంలో గెలిచినప్పుడు పొంగిపోవడం..
ఓడినప్పుడు కుంగిపోవడం వంటివి చేయకూడదు..
ఎందుకంటే గెలుపు అనేది అంతం కాదు..
ఓటమి అనేది చివరి మెట్టు కాదు..