naveen case niharika confessed crime
mictv telugu

నవీన్‏కు బ్రేకప్ చెప్పాకే హరిని ప్రేమించా..నిహారిక

March 9, 2023

సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన హరిహరకృష్ణ నేరం ఒప్పుకోవడంతో అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఇక హత్య విషయం తెలిసి కూడా కావాలనే ఎవరికీ చెప్పలేదని హరి ప్రియురాలు నిహారిక పోలీసుల ముందు ఒప్పుకుంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్‏లో ఎన్నో విషయాలను నిహారిక వెల్లడించింది.

స్టేట్మెంట్‏లో నిహారిక.. “నవీన్ నాకు ఇంటర్ నుంచే పరిచయం. ఇద్దరం లవ్ చేసుకున్నాము. మేము ఇద్దరం గొడవపడితే హరిహరకృష్ణ మాకు సర్దిచెప్పేవాడు. కొన్ని కారణాల వల్ల నవీన్‏కు నాకు బ్రేకప్ అయ్యింది. ఆ సమయంలో హరిహరకృష్ణ నన్ను లవ్ చేస్తున్నానని చెప్పాడు. మా ఇద్దరికీ బ్రేకప్ అయినా నవీన్ నాతో మాట్లాడటానికి ప్రయత్నించేవాడు. ఈ విషయం హరికి చెప్పాను. హరి కోపంతో రగిలిపోయేవాడు. నవీన్‏ను చంపి నన్ను కిడ్నాప్ చేస్తాను అని అనేవాడు. కానీ అది సరదాగా అన్నాడని అనుకునే దానిని. ఒక్కోసారి నేను తిడితే కామెడీ చేస్తున్నాను అని అనేవాడు. సడెన్‏గా ఒకరోజు హరి తన ఇంటికి తీసుకెళ్లాడు. గ్లౌజులు, కత్తి చూపించాడు. నవీన్‏ను చంపేస్తాను అని అన్నాడు. నేను పట్టించుకోలేదు. నేను నవీన్‏తో మాట్లాడటం మానేస్తాను, అతను నన్ను మరిచిపోతాడన్నాను. నువ్వు ఇక ఈ విషయం గురించి మరిచిపో అని చెప్పాను .

హత్య జరిగిన రోజు నవీన్ హరి ఫోన్ నుంచే నాకు కాల్ చేశాడు. నేను హరి చెప్పినట్లుగా వేరే అబ్బాయితో రిలేషన్‏లో ఉన్నానని నవీన్‏కి చెప్పాను. ఎందుకు ఇలా చేస్తున్నావు అని నవీన్ మాట్లాడుతుండగానే నేను ఫోన్ కట్ చేశాను. ఆ తరువాత హరి ఫోన్ చేసి నవీన్ ఇక నీతో మాట్లాడడంట అని అన్నాడు. సరేనని ఫోన్ కట్ చేశాను. మరుసటి రోజు హరి ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది. నన్ను కలవాలన్నాడు. సరేనని కలిశాను. హరి వాలకం చూసి ఆశ్చర్యం వేసింది. ఏం జరిగిందని అడిగాను. నవీన్‏ను చంపానని హరి చెప్పాడు. ఈ విషయం ఎక్కడా చెప్పదన్నాడు. వరంగల్ వెళతానంటే నేనే డబ్బులు ఇచ్చాను.

ఫిబ్రవరి 20న కాలేజ్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు హరి ఫోన్ చేసి ఎల్బీనగర్ కు రమన్నాడు. నేను అతడిని కలిశాను. ఇద్దం కలిసి నవీన్‏ను చంపిన ప్రదేశానికి వెళ్లాము. నవీన్ గురించి తెలుసుకునేందుకు అతని ఫ్రెండ్స్ నాకు కాల్ చేశారు. నాకేం తెలియదు అని చెప్పేదాన్ని. ఇక హరి కూడా తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఆ తరువాత హరి కనిపించలేదని హాసన్ ఫోన్ చేశాడు. ఎమైనా మెసేజ్‏లు ఉంటే డిలీట్ చేయమన్నాడు. 24న హరిని ఎన్జీవో కాలనీ బస్‏స్టాప్ లో చూశాను. కలిసి మాట్లాడాను. పోలీసులకు లొంగిపోతానని హరి నాకు చెప్పాడు. ఈ హత్య గురించి పోలీసులకు , నవీన్ ఫ్రెండ్స్‏కు కావాలనే చెప్పలేదు. అసలు దొరికే అవకాశం లేదని హరి చెప్పాడు. హరిని నేను నమ్మాను. నేను డబుల్ గేమ్ ఆడలేదు. నవీన్‏తో బ్రేకప్ అయిన తరువాతే హరిని ప్రేమించాను. నవీన్ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడనే హరి ఇలా చేసుంటాడు”.