రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన హరిహరకృష్ణ ప్రియురాలు నిహారికకు బెయిల్ లభించింది. రంగారెడ్డి జిల్లా కోర్టు నిహారిక రెడ్డికి బెయిల్ మంజురు చేసింది. దీంతో ఆమె జైలు నుంచి బయటకు విడుదల కానుంది. నవీన్ హత్య కేసులో ఏ1గా హరిహరకృష్ణ, ఏ2గా హరి ఫ్రెండ్ హాసన్, ఏ3గా నిహారికపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నవీన్‌ను హత్య చేసినట్లు హసన్, నిహారికకు హరిహరకృష్ణ ముందే చెప్పగా.. తమకు సమాచారం అందించకపోడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. అంతేకాకుండా ఫోన్‌లో సమాచారాన్ని డిలీట్ చేసినందుకు హాసన్, నిహారికలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ హత్య కేసులో హాసన్, నిహారికల పాత్ర ఏమైనా ఉందా అని పోలీసులు ప్రశ్నించగా.. హత్య గురించి తమకు తెలిసిన వివరాలను వెల్లడించారు. అరెస్ట్ అయిన కొన్ని రోజుల వరకూ పోలీసుల విచారణలో నిహారిక ఏమీ మాట్లాడలేదు. తనను విచారిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగింది. ఈ క్రమంలో పోలీసులు నిహారికను సఖి కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్ ఇప్పించారు. ఆ తర్వాత పోలీసులు నిహారికను అదుపులోకి తీసుకుని విచారించారు. నవీన్ ను హత్య చేసిన తర్వాత ప్రియుడు హరికి నిహారిక ఆన్ లైన్ లో రూ. 1500 పంపినట్లు తేలింది. ఇక నిహారిక కోసమే తాను నవీన్‌ను చంపినట్లు హరిహరకృష్ణ విచారణలో తెలిపాడు.