naveena died by injection in khammam
mictv telugu

‘జమాల్ ’ ఎఫెక్ట్.. ఖమ్మంలో మరో ఇంజెక్షన్ మర్డర్

September 22, 2022

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఇంజెక్షన్ మర్డర్’ హత్యల్లో కొత్త కోణాన్ని పరిచయం చేసింది. ఏమాత్రం హింసకు తావులేకుండా వ్యక్తిని చంపిన తీరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని తేలగా, తాజాగా అలాంటిదే మరో ఘటన అదే జిల్లాలో 50 రోజుల తర్వాత వెలుగు చూసింది. వివరాల్లోకెళితే.. ఖమ్మం రూరల్ మండలం పెద్ద తండాకు చెందిన భిక్షం నగరంలోని ఓ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌, అనస్తీషియా వైద్యుడి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అతనికి మొదట తన మేనకోడలితో పెళ్లవగా పిల్లలు కలగకపోవడంతో తన కంటే 20 ఏళ్లు చిన్నదైన నవీన (23)ను వివాహం చేసుకున్నాడు. మొదట్లో వీరి కాపురం బాగానే సాగగా, నవీనకు కూతురు పుట్టింది. తర్వాత ఇద్దరు సవతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అంతలోనే నవీన రెండోసారి గర్భం దాల్చింది. ప్రసవం కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా, ఆడ శిశువు పుట్టింది. ఈ క్రమంలో డెలివరీ అయిన మరుసటి రోజే నవీన హఠాత్తుగా చనిపోయింది. దీంతో భిక్షం తన బంధువులతో కలిసి ఆస్పత్రి ముందు ధర్నా చేశాడు. మీరే చంపేశారంటూ ఆరోపణలు చేశాడు.

ఆస్పత్రి వర్గాలకు నవీన ఎలా చనిపోయిందో అర్ధం కాక, భిక్షం ఇద్దరు కూతుర్లకు ఆర్ధిక సహాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు. దీంతో శాంతించిన భిక్షం నవీన మృతదేహాన్ని తీసుకొని ఖమ్మం స్మశానవాటికలో దహన సంస్కారాలు పూర్తి చేశాడు. అయితే ఇంటికి తీసుకెళ్లకుండా నగరంలో అంత్యక్రియలు నిర్వహించడంతో అనుమానం వచ్చిన ఆస్పత్రి సిబ్బంది సీసీ కెమెరాలు చెక్ చేయగా, సంచలన నిజం బయటపడింది. డెలివరీ అయిన రోజు అర్ధరాత్రి రెండు గంటలకు ఆస్పత్రికి వచ్చిన భిక్షం.. తన భార్య నవీన వద్దకు వెళ్లి ఇంజక్షన్ ఇవ్వడం, అమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక బయటికి వెళ్లి ఆందోళన చేయడం కెమెరాల్లో రికార్డయింది. దీంతో నిర్ఘాంతపోయిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, వినాయక చవితి ఉండడంతో పోలీసులు ఈ అంశంపై అంతగా దృష్టి సారించలేదు. కానీ, జమాల్ ఘటనతో ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు భిక్షంను తమదైన శైలిలో విచారించగా, వీడియోను చూసి నేరం ఒప్పుకున్నాడు. అధికమోతాదులో మత్తు మందు ఇచ్చి నవీనను హత్య చేసినట్టు అంగీకరించాడు. దీంతో అరెస్ట్ చేసిన పోలీసులు రెండు వారాల క్రితమే భిక్షంను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.