దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. 2023-24 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని జేఎన్వీఎస్టీ తెలిపింది. ఏప్రిల్ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించి, ఫలితాల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. ఐదోతరగతి విద్యార్థులు మే 1 2011-2013 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి. జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసం ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్/గుర్తింపు పొందిన స్కూల్లో 2022-23 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న వారు అర్హులు.
www.navodaya.gov.in వెబ్ సైట్లో విద్యార్థి ఫొటో, సంతకం, తల్లి/ తండ్రి సంతకం, ఆధార్ కార్డ్/ నివాస ధ్రువపత్రం, స్కూల్ హెడ్మాస్టర్ నుంచి వెరిఫికేషన్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయసి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌కు సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే వెల్లడికానుంది. మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. సిలబస్‌తో పాటు మెంటల్ ఎబిలిటీ, ఆర్థమెటిక్ వంటి వాటిని నుంచి ప్రశ్నలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్షను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు.
దేశ వ్యాప్తంగా 649 నవోదయ విద్యాలయాలు ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో 22 విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో ఒక్కో విద్యాలయంలో ఆరో తరగతికి 80 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. జిల్లాల వారీగా ఈ విద్యాలయాల్లో గ్రామీణ విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయిస్తారు. భోజన, వసతి సదుపాయాలతో పాటు యూనిఫాం, బుక్స్ కూడా ఉచితంగా అందిస్తారు. తొమ్మిది నుంచి 12 వ తరగతి విద్యార్థులు మాత్రం విద్యాలయ వికాస్ నిధి కోసం నెలనెలా రూ.600 చెల్లించాలి. బాలికలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, పేదలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.