డ్రీమ్ 11.. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్.. చాలా మందికి తెలిసిన పేరే. ఇందులో డబ్బులు గెలుచుకోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. తమ అంచనాల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తొలిస్థానంలో నిలిచి జాక్‌పాట్ కొట్టాలని భావిస్తుంటారు. కానీ, అతికొద్ది మందికే అలాంటి అవకాశం లభిస్తుంటుంది. అలాంటి వాళ్లలో రాజు రామ్ ఒకరు. డ్రీమ్ 11లో రాత్రిరాత్రే రూ.కోటి కొల్లగొట్టాడు.
బీహార్‌లోని నవాడ.. పిప్రా గ్రామానికి చెందిన రాజు రామ్ గత ఏడాదిన్నరగా డ్రీమ్ 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తాజాగా బ్రిస్బేన్ హీట్ వర్సెస్ సిడ్నీ థండర్ మ్యాచ్‌లో రూ.49 పెట్టి ఫాంటసీ గేమ్ ఆడాడు. ఈ గేమ్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో రూ.కోటి గెలుచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రాజురామ్ కుటుంబ సభ్యులు ముందు నమ్మలేదు. గెలుచుకున్న మొత్తంలో పన్ను తీసివేయగా.. రూ.70 లక్షలు అతడి ఖాతాలో జమయ్యాయి. అప్పుడే అంతా నమ్మారు.
డ్రీమ్11లో గెలుచుకున్న సొమ్మును వ్యాపారం కోసం ఉపయోగిస్తానని రాజురామ్ తెలిపాడు. తాను ఇప్పటి వరకు కొంతమొత్తం గెలుచుకున్నానని.. ఇప్పుడు రూ.75 లక్షలు సంపాదించడం సంతోషంగా ఉందని చెప్పాడు.